One World One Family Cup 2024 :దిగ్గజ క్రికెటర్లంతా రెండు జట్లుగా విడిపోయి వన్ వరల్డ్, వన్ ఫ్యామిలీ టీమ్ పేరిట ఓ టీ20 ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. 'ఒకే ప్రపంచం - ఒకే కుటుంబం' అనే నినాదాన్ని వ్యాప్తి చేసేందుకు ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌ను నిర్వహించారు. వీరిలో భారత్ సహా ఇతర దేశాలకు చెందిన క్రికెట్ దిగ్గజాలు ఉన్నారు. బెంగళూరులోని సాయి క్రిష్ణన్ క్రికెట్ అకాడమీలో ఈ మ్యాచ్ జరిగింది. వన్ వరల్డ్ టీమ్‌కు సచిన్ తెందుల్కర్ కెప్టెన్‌గా వ్యవహరించగా వన్ ఫ్యామిలీ జట్టుకు దిగ్గజ ఆల్‌రౌండర్ యవరాజ్ సింగ్ సారథ్యం వహించాడు. అయితే ఈ మ్యాచ్‌లో పఠాన్ బ్రదర్స్ విషయంలో ఓ ఆసక్తికర విషయం జరిగింది. అన్న వేసిన ఆఖరి ఓవర్‌లో తమ్ముడు సిక్స్ బాది తన జట్టును గెలిపించుకోవడం విశేషం. ఆ వెంటనే తనను క్షమించాలంటూ తన అన్నను హత్తుకున్నాడు.
మొదట బ్యాటింగ్ చేసిన వన్ ఫ్యామిలీ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ప్లేయర్ డారెన్ మ్యాడీ(51) హాఫ్ సెంచరీతో రాణించగా లంక మాజీ వికెట్ కీపర్ కలువితరణ 22, టీమ్ఇండియా మాజీ ప్లేయర్స్ యూసఫ్ పఠాన్ 38, యువరాజ్ సింగ్(10 బంతుల్లో 23) రన్స్ చేశారు. వన్ వరల్డ్ బౌలర్లలో హర్భజన్ సింగ్ 2 వికెట్లు తీయగా సచిన్, ఆర్పీ సింగ్, అశోక్ దిండా, మాంటీ పనేసర్ తలో వికెట్ పడగొట్టారు.