ఇటీవల ముగిసిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌పై కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్పందించాడు. ఏకైక మ్యాచ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. ఆ ఒక్క మ్యాచ్ ద్వారా టీమ్ఇండియా గురించి పూర్తిగా అంచనా వేయలేమని పేర్కొన్నాడు. టీమ్ఇండియా ఆటగాళ్లు జెంటిల్మన్ గేమ్‌కు అంబాసిడర్ల వంటి వారని కొనియాడాడు. ఆ దేశ అభిమానులు క్రికెట్ పట్ల గొప్ప ప్రేమను చూపిస్తారని అభిప్రాయపడ్డాడు.
ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లో కోహ్లీసేనపై కివీస్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 139 పరుగుల లక్ష్య ఛేదనలో హాఫ్ సెంచరీతో తమ జట్టును విజయతీరాలకు చేర్చాడు కేన్.
"ప్రతిష్ఠాత్మక ఏకైక ఫైనల్ మ్యాచ్ అనేది ఆసక్తికరంగా ఉంది. కానీ, ఈ ఒక్క మ్యాచ్ ద్వారా మొత్తం టీమ్ఇండియా ఏంటనేది చెప్పలేం. కోహ్లీసేన చాలా బలమైన జట్టని మాకు తెలుసు. ఇంత గొప్ప జట్టుపై ఫైనల్లో గెలిచినందుకు గర్వంగా ఉంది. మేము వారిపై గెలిచినంత మాత్రాన వారిది బలహీనమైన జట్టని కాదు. టీమ్ఇండియా గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మంచి పేస్ ఎటాక్‌తో పాటు నాణ్యమైన స్పిన్నర్లు ఆ జట్టులో ఉన్నారు. ఇక బ్యాటింగ్‌లో వారికి తిరుగు లేదు.'