బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ పదవీ కాలం పూర్తవ్వడం వల్ల.. కొత్త అధ్యక్షునిగా టీమ్ఇండియా 1983 ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన ఆల్‌రౌండర్ రోజర్ బిన్నీ రోజర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 18న ముంబయిలో జరిగే బోర్డు ఏజీఎమ్‌లో బిన్నీ అధికారికంగా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే దాదా ప్రెసిడెంట్ పదవిని వదులుకోవడానికి సుముఖంగా లేనట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దాదా దీనిపై స్పందించారు. అధ్యక్షుడిగా పదవిని తాను ఆస్వాదించినట్లు తెలిపారు.
"బంగా క్రికెట్ అసోషియేషన్‌కు దాదాపు 5 ఏళ్లు ప్రెసిడెంట్‌గా వ్యవహరించాను. బీసీసీఐ అధ్యక్షుడిగా మూడేళ్ల నుంచి కొనసాగుతున్నాను. ఓ సారీ పదవీ కాలం పూర్తయిపోతే ఇక అంతే.. దాన్ని విడిచిపెట్టాల్సిందే. మనం నిరంతరం ఒకే పనిని చేస్తూ ఉండలేము కదా. ఓ ప్లేయర్‌గా ఓ అధ్యక్షునిగా నాణేనికి ఉన్న రెండువైపులను చూశాను." అని గంగూలీ పేర్కొన్నారు.
కాగా, బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా మాత్రం అదే పదవిలో కొనసాగనున్నాడు. అయితే అతడు ఐసీసీ బోర్డ్‌లో భారత ప్రతినిధిగా గంగూలీ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. ఆశిష్ శేలార్ ట్రెజరర్‌గా ఎంపిక కానున్నాడట. ఇక రాజీవ్ శుక్లా వైస్ ప్రెసిడెంట్‌గా తన పదవిని కొనసాగించనున్నాడు. కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ సింగ్ ధుమాల్ ఐపీఎల్ ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.