Suraj randiv bus driver: క్రికెట్‌లో తమ దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో అయితే కేవలం ఆయా బోర్డులు ఇచ్చే భత్యాలపైనే ఆధారపడాల్సి ఉండేది. కానీ, ఎప్పుడైతే భారత టీ20 లీగ్ వచ్చిందో సెలెక్ట్ అయిన ఆటగాళ్లకు కాసులపంటే పండుతోంది. ఒక్క మ్యాచ్ ఆడినా లక్షల్లో దక్కుతున్నాయి. ఆటకు వీడ్కోలు పలికితే వ్యాఖ్యాతగా మారొచ్చు. ఏదైనా లీగ్‌ల్లో సహాయక సిబ్బందిగా చేరే ఛాన్స్‌లు వస్తుంటాయి. లేకపోతే క్రికెట్ ట్రైనింగ్ ఇస్తూనైనా సంపాదించవచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కొందరి పరిస్థతి మాత్రం దుర్భరంగా మారిందనేదానికి ఈ మాజీ ఆటగాడే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రస్తుతం తన కుటుంబం కోసం డ్రైవర్‌గా మారిపోయిన ఆ మాజీ క్రికెటర్ శ్రీలంకకు చెందిన సూరజ్ రణ్‌దివ్. లంక తరఫున 12 టెస్టులు, 31 వన్డేలు, ఏడు టీ20లు ఆడాడు. మొత్తం మూడు ఫార్మాట్లలో దాదాపు 85 వికెట్లు పడగొట్టాడు. భారత టీ20 లీగ్‌లోనూ ఆడటం విశేషం. ఆకాశం ఎత్తుకు ఎదిగిన ఆటగాడు ఒక్క ఉదుటన కిందికి పడిపోయిన సూరజ్ జీవితం ప్రతి క్రికెటర్‌కు గుణపాఠంలాంటిదే. అతడి జీవితం ఎందుకు ఇలా మారిందో కారణాలు తెలియదు కానీ.. ప్రస్తుత తరం ఆటగాళ్లు మాత్రం పక్కాగా లైఫ్‌ను తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ధోనీ నాయకత్వంలో..
2009లో లంక జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసిన సూరజ్ కేవలం ఏడేళ్లకే తన కెరీర్‌ను ముగించాల్సి వచ్చింది. 2011 వరల్డ్ కప్‌లో పాల్గొన్న లంక జట్టులో సభ్యుడు. అయితే ధోనీ కెప్టెన్సీలో భారత్ 2011 ప్రపంచకప్ ఫైనల్‌లో లంకను ఓడించి మరీ నెగ్గిన విషయం తెలిసిందే. తుదిపోరులో సూరజ్ పెద్దగా రాణించలేదనే చెప్పాలి. అయితే కేవలం రెండేళ్లకే జాతీయ జట్టులోకి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకతను చాటుకొన్నాడు. దీంతో భారత టీ20 లీగ్‌లోకి అడుగుపెట్టే అవకాశం దక్కింది. అదీనూ ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై జట్టులో స్థానం సంపాదించాడు. అయితే 2011 సీజన్‌లో కేవలం ఎనిమిది మ్యాచ్‌లను మాత్రమే ఆడాడు. ఆరు వికెట్లను తీశాడు. ఇక తర్వాతి సీజన్ నుంచి భారత టీ20 లీగ్‌లో మళ్లీ కనిపించలేదు.