తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ధోనీ.. ధోనీ.. ధోనీ'.. సౌండ్ ఇంకా వినిపిస్తూనే ఉంది! - ధోనీ

28 ఏళ్ల భారత దేశ కల, మూడు ఐసీసీ ట్రోఫీలు, టెస్టుల్లో నెం.1 స్థానం.. సంపాదించి పెట్టిన క్రికెట్​ దిగ్గజం మహేంద్ర సింగ్​ ధోనీ.. ఆటకు వీడ్కోలు పలికి ఆదివారానికి(ఆగస్టు) ఏడాది పూర్తయింది. దేశంలో క్రికెట్​ అభిమానులకు ఎన్నో మధురానుభూతులను మిగిల్చిన అతడు.. ఆటకు దూరమై చేదు జ్ఞాపకాన్ని మిగిల్చాడు.

suresh raina, ms dhoni
సురేష్ రైనా, ఎంఎస్ ధోనీ

By

Published : Aug 15, 2021, 3:55 PM IST

చేదు జ్ఞాపకాలను ఎవరైనా ఎందుకు గుర్తుకుతెచ్చుకోవాలి? అవసరం లేదు కదా. కానీ అది మిగిలించింది మర్చిపోలేని అనుభూతిలెన్నో ఇచ్చిన వ్యక్తి అయితే? భారత జాతి 28 ఏళ్ల కల నెరవేర్చినవాడైతే. అనితరసాధ్యమైన ఘనతలతో దేశాన్ని సగర్వంగా నిలిపినవాడైతే.. అతడిని గుర్తుచేసుకోవాలి. అతడేం చేశాడో స్మరించుకోవాలి.

2020 ఆగస్టు 15.. యావత్​ దేశం స్వాతంత్య్ర సంబరాల్లో మునిగితేలుతున్న వేళ.. ఏ హడావుడీ లేకుండా.. 'దిగ్గజాన్ని.. నాకు ఘనంగా వీడ్కోలు పలకాలి' లాంటి వ్యవహారం లేకుండా ఆటకు, అభిమానులకు సైలెంట్​గా గుడ్​బై చెప్పేశాడు టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. అదే అతడి స్టైల్.

బెస్ట్​ ఫినిషర్​గా..

ధోనీ.. క్రికెట్​కు, దేశానికి ఏం చేశాడో కొత్తగా చెప్పనవసరం లేదు. జట్టులో సుస్థిరత లేని దశలో పగ్గాలు చేపట్టి.. నెం.1గా నిలబెట్టడం, సీనియర్లు పక్కనబెడుతున్నాడనే అపవాదు వస్తున్నా.. జూనియర్లకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సాహించడం, మ్యాచ్​ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో 'బెస్ట్​ ఫినిషర్' అవతారమెత్తి​ విజయ తీరాలకు చేర్చడం, ఎలాంటి పరిస్థితిలో అయినా ప్రశాంతంగా ఉండగలగడం.. 'మిస్టర్​ కూల్​' మహీకే చెల్లింది. అతడి జులపాల జుట్టు, హెలికాప్టర్​ షాట్​ల కోసమే ప్రత్యేకమైన అభిమానులున్నారు.

ధోనీ బ్యాటింగ్

టెస్టుల్లో నెం.1 జట్టుగా టీమ్​ఇండియాను నిలిపినా, 2007 ఐసీసీ టీ20 ప్రపంచకప్​ నెగ్గినా.. దాదాపు మూడు దశాబ్దాల కల.. 2011లో వన్డే ప్రపంచకప్​ నెగ్గినా.. 2013లో ఛాంపియన్స్​ ట్రోఫీ కైవసం చేసుకున్నా.. ట్రోఫీని సహచరులకు ఇచ్చి పక్కన నిల్చునే స్వభావం ధోనిది.

బ్యాట్​తోనే సమాధానం..

ఫామ్​ కోల్పోయినప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. తిరిగి బ్యాటుతోనే సమాధానం చెప్పాడు. విఫలమవుతున్న వారికి పలుమార్లు అవకాశాలిచ్చాడు. సరైన సమయంలో సారథ్య బాధ్యతలు వదులుకున్నాడు. ఎందరో యువకులను ఆణిముత్యాలుగా తీర్చిదిద్దాడు. కానీ అప్పటికీ అప్పుడప్పుడూ బ్యాటుతో విఫలం కావడం వల్ల రిటైర్​ కావాలని డిమాండ్​లు వచ్చేవి. ముందు 2019 ప్రపంచకప్​ ఉండటం, జట్టులో పూర్తిగా యువకులు ఉండటం కారణంగా అతడి అవసరం దృష్ట్యా మౌనంగా ఉండిపోయాడు.

ఇక వన్డే ప్రపంచకప్​ రానే వచ్చింది. సెమీస్​కు దూసుకెళ్లిన టీమ్​ఇండియా ఫైనల్​ బెర్త్​ కోసం న్యూజిలాండ్​తో పోరాడుతోంది. 240 పరుగుల ఛేదనలో భారత్​కు శుభారంభం దక్కలేదు. అప్పటికీ జడేజాతో కలిసి పోరాడే క్రమంలో 50 పరుగులు చేసి రనౌట్​గా వెనుదిరిగాడు. కోట్లాది మంది అభిమానులతో పాటు తాను కూడా భావోద్వేగానికి గురయ్యాడు.

సైలెంట్​గా ప్రకటించాడు..

ఆ తర్వాత క్రికెట్​కు దూరంగా ఉన్న ధోనీ.. అనూహ్యంగా 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించాడు. అదీ ఓ చిన్న ఇన్​స్టాగ్రామ్​ పోస్ట్​ ద్వారా. ఎన్నో మధురానుభూతులను, మరెన్నో తీపి జ్ఞాపకాలను మిగిల్చిన మహీ.. ఈ రోజున మాత్రం అభిమానులకు ఓ చేదు వార్త చెప్పాడు. అయినా ఈ రోజును ఏటా గుర్తుచేసుకుంటూనే ఉంటాం. ఎందుకంటే దాని వెనకాల మరవలేని, మరుపురాని మరెన్నో తీపి జ్ఞాపకాలను విడిచివెళ్లాడు గనుక.

ధోనీతో విరాట్

గ్రౌండ్​లోకి దిగగానే శివాలెత్తినట్టు ఊగిపోయే అభిమానగనం ఎంతమంది సొంతం? సచిన్.. సచిన్​.. అంటూ తెందూల్కర్​ను స్మరించే ఫ్యాన్స్​.. ఆ తర్వాత ఆ స్థాయిలో ధోనీ.. ధోనీ.. అంటూ స్టేడియాన్ని హోరెత్తించారు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్​లో ధోనీ ఆడట్లేదు.. అయినా అతడి పేరు ఇంకా మదిలో మార్మోగుతూనే ఉంది.

మహీ దారిలోనే రైనా..

ధోనీ వీడ్కోలు ప్రకటించిన కొద్దిసేపటికే అంతర్జాతీయ క్రికెట్​ నుంచి వైదొలిగాడు టీమ్​ఇండియా స్టార్ ఆల్​రౌండర్, అతడి సహచరుడు సురేశ్​ రైనా.

రైనా ఫీల్డింగ్ విన్యాసం

మహేంద్రుడితో రైనాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇద్దరూ దాదాపు ఒకేసారి జట్టులోకి వచ్చారు. ధోనీ నాయకత్వంలో సిసలైన ఆల్​రౌండర్​గా ఎదిగాడు. జట్టు చాలా విజయాలలో కీలకపాత్ర పోషించాడు ఈ లెఫ్ట్​ హ్యాండ్​ బ్యాట్స్​మన్​. మిడిలార్డర్​లో మ్యాచ్ విన్నింగ్​ ప్రదర్శనలెన్నో చేశాడు. బౌలింగ్​లోనూ అద్భుతాలు చేసే స్థాయికి ఎదిగాడు. ఐపీఎల్​లో ఒకే ఫ్రాంఛైజీకి ప్రాతినిధ్యం వహించారు ఈ ద్వయం. ఇంకా ఐదారేళ్లు ఆడే సత్తా తనలో ఉన్నా మహీ రిటైర్మెంట్​ విషయం తెలియగానే తాను క్రికెట్​కు గుడ్​ బై చెప్పేశాడు. కేవలం ఐపీఎల్​కే పరిమితం అయ్యాడు. ఒకవేళ ధోనీ ఐపీఎల్​కు వీడ్కోలు పలికితే తాను కూడా అదే బాటలో వెళ్తానని ఇదివరకే ప్రకటించాడు.

సురేశ్ రైనా

ఇవీ చదవండి:

ధోనీ రిటైర్మెంట్ తీసుకోవడానికి అదీ ఓ కారణం!

ధోనీ ఆడకపోతే.. నేనూ ఆడను: రైనా

ధోనీ వీడ్కోలు.. బీసీసీఐ అలా చేయడమేంటి?

ABOUT THE AUTHOR

...view details