National Cricket Day: సచిన్ తెందూల్కర్.. భారత క్రికెట్ చరిత్రలో చెరగని అధ్యాయం లిఖించిన వ్యక్తి. ఎన్నో రికార్డులు నెలకొల్పి, మరెన్నో రికార్డులను తిరగరాసిన దిగ్గజం. ఆటపై అంతగా ప్రభావం చూపాడు కాబట్టే అతడిని అభిమానులంతా 'గాడ్ ఆఫ్ క్రికెట్'గా పిలుచుకుంటూ ఉంటారు. ఆ బ్యాటింగ్ దిగ్గజం పుట్టిన రోజు నేడు(ఏప్రిల్ 24). ఈ సందర్భంగా అతడికి అన్ని వైపుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఓ ఆసక్తికరమైన ప్రతిపాదన చేశారు. సచిన్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూనే.. ఈ ప్రత్యేకమైన రోజును 'జాతీయ క్రికెట్ దినోత్సవం'గా జరుపుకుంటే బాగుంటుందని సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నాడు. ఏప్రిల్ 24వ తేదీని సచిన్ పేరిట చిరస్మరణీయంగా ఉండిపోయేలా చేయాలని పిలుపునిచ్చాడు.
Sachin Tendulkar birthday:'ఏప్రిల్ 24ను జాతీయ క్రికెట్ దినోత్సవంగా ప్రకటిస్తే ఎలా ఉంటుంది? క్రికెట్ పట్ల ఇంత పిచ్చి ప్రేమ ఉన్న వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు. క్రికెట్‌పై భారత్‌లో అమర ప్రేమకు కారణమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు' ట్వీట్ చేశాడు కైఫ్. ఈ ప్రతిపాదనకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. చాలా మంది నెటిజన్లు కైఫ్‌కు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. సచిన్ రాకతో భారత్‌లో క్రికెట్‌కు ఆదరణ పెరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.