Ollie Robinson Sledging : క్రికెట్లో సాధారణంగా విదేశీ ఆటగాళ్లు ఎక్కువగా ప్రత్యర్థుల పట్ల స్లెడ్జింగ్‌కు పాల్పడుతుంటారు. ఈ క్రమంలోనే యాషెస్ 2023 తొలి మ్యాచ్‌లో ఆఖరి రోజు ఆస్ట్రేలియాబ్యాటర్ ఉస్మాన్ ఖవాజాను ఉద్దేశించి ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ పేసర్ ఓలీ రాబిన్‌సన్ స్లెడ్జ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సహా ఇతర ఆటగాళ్లపైనా రాబిన్‌సన్.. వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో అతడు వివాదాల్లోకెక్కాడు.
ఆట సాగుతుండగా ప్రత్యర్థులపై స్లెడ్జింగ్ చేయడం రాబిన్‌సన్‌కు కొత్తేమీ కాదు. గతంలో ఈ తరహాలోనే రాబిన్‌సన్ స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. భారత స్టార్ బ్యాటర్విరాట్ కోహ్లీ - రాబిన్‌సన్ మధ్య గతంలో మాటల యుద్ధం నడిచింది. ఆ సంఘటన ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే టీమ్ఇండియాలో స్లెడ్జింగ్‌కు పాల్పడే ప్లేయర్ల సంఖ్య చాలా తక్కువ. కానీ జట్టులో ఏ ప్లేయర్‌పై అయినా ప్రత్యర్థి ఆటగాళ్లు స్లెడ్జ్ చేస్తే.. కింగ్ కోహ్లీ బ్యాటుతో పాటు మాటలతోనూ జవాబిస్తాడు. గత కొన్నేళ్లుగా విరాట్ ఇలాంటి ఘటనలు చాలా ఎదుర్కొన్నాడు.
తనపై స్లెడ్జ్ చేసిన ఆటగాడిని విరాట్.. గుర్తుపెట్టుకుని మరీ నిద్రలేని రాత్రిని మిగిలుస్తాడు. తనదైన రోజున అంత పరాక్రమవంతంగా.. స్లెడ్జ్ చేసిన బౌలర్‌పై ఏ మాత్రం జాలి చూపకుండా చీల్చి చెండాడతాడు. అయితే అదే పద్ధతిలో ప్రస్తుత యాషెస్‌లో ఓలీ రాబిన్‌సన్‌కు తమ ఆటగాళ్లు.. విరాట్ లాంటి ట్రీట్‌మెంట్‌ను.. ఇవ్వాలని ఆస్ట్రేలియా అభిమానులు ఎదురుచూస్తున్నారు.