ODI WorldCup 2023 Semi Final Race : ప్రపంచ కప్ 2023 రసవత్తరంగా సాగుతోంది. దాదాపుగా సగం మ్యాచులు పూర్తైపోయాయి. అప్పుడే సెమీస్ రేసు గురించి చర్చ మొదలైపోయింది. అందరి నోట దీని గురించే ప్రశ్నలు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టీమ్ఇండియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా... టాప్-4లో ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే.. ఈ నాలుగింటికే సెమీస్‌కు వెళ్లే ఛాన్స్ ఉంది. కానీ, ఇప్పుడు వరల్డ్ కప్ 2023 రోజురోజుకి సంచలన విజయాలు ఎదురౌతున్నాయి. ఇప్పటికే మూడు సంచలన విజయాలు నమోదయ్యాయి. దీంతో టాప్ 4 స్థానాలను అంత సులువుగా నిర్ణయించే పరిస్థితి అస్సలు కనిపించడం లేదు.
టాప్ 1లో ఉన్న టీమ్ఇండియా.. ఆడిన ఐదు మ్యాచుల్లోనూ గెలిచి 10 పాయింట్లు, 1.353 నెట్ రన్‌రేట్‌తో అగ్రస్థానంలో నిలిచింది. మిగిలిన నాలుగు మ్యాచుల్లో ఇంగ్లాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌తో పోటీపడనుంది. ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తుంటే ఈ జట్లపై జరగనున్న మ్యాచుల్లో విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదని పిస్తోంది. ఏదైనా ఓ సంచలన విజయం నమోదు అయితేనే తప్ప భారత్ అగ్ర స్థానం నుంచి కిందకు పడే అవకాశం లేదు. అలానే దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్టులో భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి.. అక్కడ విజయం సాధిస్తేనే భారత్ స్థానాన్ని డిసైడ్ అవుతుంది.
రెండూ, మూడు ఎవరంటే..ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగు మ్యాచ్‌లు గెలిచి ప్రస్తుతానికి రెండో స్థానంలో ఉంది దక్షిణాఫ్రికా. ఇంగ్లాండ్, బంగ్లాదేశ్‌పై భారీ విజయాలు అందుకుని రన్‌రేట్ (2.370) అందరి కన్నా ఎక్కువగా ఉంది. ఈ జోరు ఇలానే కొనసాగిస్తే ఆ జట్టు సెమీస్ బెర్త్ ఖాయమనే చెప్పాలి. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్‌తో ఆడనుంది. ఇవి కఠినమైన జట్లే. ఈ మూడింటిలో ఏమైనా తేడా కొడితే.. నెట్‌రన్‌రేట్ ఆ జట్టును కాపాడుతుంది.
ఇక సౌతాఫ్రికాలానే ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించిన న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉంది. టీమ్ఇండియాపై ఓడిన న్యూజిలాండ్.. టోర్నీలో ప్రస్తుతం నిలకడగా రాణిస్తోంది. ఈ జట్టు మిగిలిన నాలుగు మ్యాచుల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంకతో పోటీపడనుంది. మరి న్యూజిలాండ్ ప్రస్తుత ఫామ్ చూస్తే నాలుగు మ్యాచుల్లోనూ విజయావకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అనిపిస్తోంది. కానీ ప్రస్తుతం నమోదు అవుతున్న సంచలన విజయాలతో ఏం జరుగుతుందో చెప్పలేం. ఇప్పటికే ఈ టోర్నీలో మూడు పెద్ద జట్లకు షాకులు తగిలిన సంగతి తెలిసిందే.