తెలంగాణ

telangana

ETV Bharat / sports

ODI World Cup : మరో 50రోజుల్లో వన్డే సమరం.. జట్టులో హైదరాబాదీకి ప్లేస్​​ డౌటే! - వన్డే ప్రపంచకప్​ 2023 స్క్వాడ్​

ODI World Cup 2023 : వెస్టిండీస్‌ పర్యటనలో అద్భుత ప్రదర్శనతో చెలరేగిపోయిన ప్లేయర్స్​ ఇప్పుడు రానున్న ప్రపంచ కప్​ కోసం సంసిద్ధమౌతున్నారు. అయితే ఇప్పుడు చర్చంతా హైదరాబాదీ కుర్రాడు తిలక్‌ వర్మ గురించే. అతని ఆట తీరును చూసిన ఎందరో ప్లేయర్లు అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. దీంతో వన్డే ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలన్న డిమాండ్లు ఊపందుకునున్నాయి. మరి ఈ ప్రతిభావంతుడి గురించి సెలక్టర్లు ఏమనుకుంటున్నారు? అతడి అవకాశాలేంటి?

ODI World Cup 2023
వన్డే ప్రపంచ కప్​

By

Published : Aug 16, 2023, 8:04 AM IST

Updated : Aug 16, 2023, 9:11 AM IST

ODI World Cup 2023 : పొట్టి క్రికెట్​ ఫార్మాట్​లో రెండేళ్లకో ప్రపంచకప్​ను చూస్తున్నాం. సుమారు ఏడాది వ్యవధిలోనూ రెండు టీ20 ప్రపంచకప్‌లు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక టెస్టుల్లోనూ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు జరుగుతున్నాయి. కానీ క్రికెట్‌ అభిమానులకు అసలైన ప్రపంచకప్‌ అంటే మాత్రం వన్డే ట్రోఫీనే గుర్తొస్తుంది. చెప్పాలంటే దానికున్న హిస్టరీనే వేరు. దానికున్న విలువ వేరు.

World Cup 2023 : క్రీడా ప్రపంచంలో ఉన్న ప్రతి క్రికెటరూ ఆ కప్​ను ముద్దాడాలని కలలు కంటుంటారు. ఒక్క క్రికెటర్​కే కాదు క్రికెట్‌ అభిమానిలోనూ ఉద్వేగాన్ని రేకెత్తించే టోర్నీ అది. ఈ క్రమంలో నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి సరిగ్గా ఇంకో 50 రోజులే మిగిలి ఉంది. ఈ సారి జరగనున్న మెగా టోర్నీకి భారత్‌ ఆతిథ్యమిస్తుండటం వల్ల మన అభిమానులకు మరింత ప్రత్యేకంగా మారింది.

World Cup 2023 Highlights : ఇక సొంతగడ్డపై రోహిత్‌ సేన భారీ అంచనాలతో బరిలోకి దిగనుంది. ప్రపంచకప్‌ సమీపిస్తున్న తరుణంలో ఓ వైపు అందులో పోటీ పడే జట్లన్నీ మైదానంలో తీవ్ర కసరత్తులు చేస్తుండగా.. మరోవైపు బీసీసీఐ, ఐసీసీలు టోర్నీ సన్నాహాల్లో బిజీ బిజీగా ఉన్నారు. అభిమానులు కూడా కొత్త టోర్నీ కోసం ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రానున్న ప్రపంచకప్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలను ఓ సారి చూసేద్దామా..

  1. ఇప్పుడు రానున్నది 13వ వన్డే ప్రపంచకప్‌. ఇక ఈ టోర్నీకి భారత్‌ ఆతిథ్యమివ్వడం ఇది నాలుగోసారి. 1987లో తొలిసారి పాకిస్థాన్‌తో కలిసి ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమివ్వగా.. ఆ తర్వాత 1996లో ప్రపంచకప్‌ నిర్వహణలో భారత్‌కు పాకిస్థాన్‌, శ్రీలంక తోడయ్యాయి. ఇక 2011లో భారత్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ కలిసి ఉమ్మడిగా టోర్నీకి ఆతిథ్యమిచ్చాయి. అయితే నాలుగోసారి మాత్రం భారత్‌ మాత్రమే ప్రపంచకప్‌ను నిర్వహించనుంది.
  2. ఇక వన్డే ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా అత్యధికంగా అయిదుసార్లు (1987, 1999, 2003, 2007, 2015) ముద్దాడింది. ఇందులో వెస్టిండీస్‌ (1975, 1979), భారత్‌ (1983, 2011), రెండుసార్లు కప్పు నెగ్గాయి. ఇక పాకిస్థాన్‌ (1992), శ్రీలంక (1996), ఇంగ్లాండ్‌ (2019) ఒక్కోసారి టైటిల్​ను సాధించాయి. పెద్ద జట్లలో న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా మాత్రం ఇంకా కప్పు గెలవలేదు.
  3. 1983లో తొలిసారి కపిల్‌ దేవ్​ నాయకత్వంలో వన్డే ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న భారత్‌.. 28 ఏళ్ల తర్వాత 2011లో ధోని సారథ్యంలో మరోసారి ఆ ట్రోఫీని అందుకుంది. ఇప్పుడు రోహిత్‌ సారథ్యంలో మూడో సారి కప్పు వేటకు సిద్ధమవుతోంది.
  4. 2011 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన ఆటగాళ్లలో ఒక్క విరాట్‌ కోహ్లి మాత్రమే ప్రస్తుత జట్టులో ఉన్న సభ్యుడు.
  5. 2019 అక్టోబరు 5న ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌, రన్నరప్‌ న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌తో మొదలయ్యే ప్రపంచకప్‌ నవంబరు 19న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ టోర్నీలో 45 లీగ్‌ మ్యాచ్‌లు సహా మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి.
  6. ఈ సారి టోర్నీలో పది జట్లు పోటీ పడుతుండగా.. లీగ్‌ దశలో ప్రతి జట్టూ మిగతా తొమ్మిది జట్లలో ఒక్కో లీగ్‌ మ్యాచ్‌ ఆడనుంది. లీగ్‌ దశలో టాప్‌-4లో నిలిచే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.
  7. ఇక ఆరంభ, ఫైనల్‌ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యమిస్తుంది. మొత్తం 10 వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. హైదరాబాద్‌ మూడు లీగ్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తుంది. అయితే ఇక్కడి ఉప్పల్‌ స్టేడియానికి భారత్‌ మ్యాచ్‌ను మాత్రం కేటాయించలేదు.

Tilak Varma In ODI World Cup 2023 : ఇటీవలే జరిగిన విండీస్​ పర్యటనలో యంగ్​ ప్లేయర్​ తిలక్​ వర్మ తన సత్తా చాటాడు. ఐపీఎల్‌లో అదిరే ఆటతో ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ హైదరాబాదీ కుర్రాడు.. అదే జోరును కొనసాగిస్తూ విండీస్‌తో టీ20ల్లోనూ అదరగొట్టాడు. నిలకడగా రాణించిన తిలక్.. ఓ అర్ధశతకం, ఓ అజేయ 49 సహా అయిదు మ్యాచ్‌ల్లో 173 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఈ 20 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాటర్‌ తన ఆట తీరుతో అభిమానులను, మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లనూ ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో తిలక్‌ను వన్డే ప్రపంచకప్‌లో చూడగలమా అన్నదే ఇప్పుడు అందరి మదిలో ఉండే ప్రశ్న.

అయితే విండీస్‌లో తిలక్‌ వర్మ తన చక్కని ప్రదర్శనతో అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీని ఎంతో ఆకట్టుకున్నాడని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. కానీ ఇప్పుడే అతణ్ని వన్డే క్రికెట్లో ఆడించడం, ప్రపంచకప్‌కు ఎంపిక చేయడం తొందరపాటు అవుతుందనే ఉద్దేశంతో కమిటీ ఉందట.

శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ దూరమైతే తప్ప ప్రపంచకప్‌ జట్టు ఎంపిక సమయంలో తిలక్‌ పేరు చర్చకు రాదని ఆ అధికారి తెలిపాడు. మరోవైపు ఆసియాకప్‌తో రాహుల్‌, శ్రేయస్‌ పునరాగమనానికి సిద్ధమవుతుండగా.. సూర్యకుమార్‌, వన్డేల్లో మెరుగైన రికార్డున్ను శాంసన్‌ రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో తిలక్‌ వర్మ ప్రపంచకప్‌కు ఎంపికయ్యే అవకాశాలు తక్కువే.

Last Updated : Aug 16, 2023, 9:11 AM IST

ABOUT THE AUTHOR

...view details