ODI World Cup 2023 Spinners : ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టును ప్రకటించారు. సొంతగడ్డపై టోర్నీ జరుగుతున్నందున ప్లేయర్ల ఎంపికలో తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఇక్కడి పిచ్‌లు స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తున్నందున జట్టులో ముగ్గురు స్పిన్నర్లకు చోటిచ్చారు. అయితే ఆ ముగ్గురిలో ఒక్క కుడి చేతి వాటం ఆఫ్‌స్పిన్నరూ లేడు. కుల్‌దీప్ యాదవ్ చైనామన్ స్పిన్నర్ కాగా.. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఎడమ చేతి వాటం స్పిన్నర్లు. వాళ్ల బౌలింగ్ కుడిచేతి వాటం లెగ్ స్పిన్నర్లు బంతులేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కుల్‌దీప్ ఎడమచేతి వాటంలో ఆఫ్‌స్పిన్ వేస్తాడు. దాన్నే 'చైనామన్' స్టైల్ అని అంటారు. అయితే రవిచంద్రన్ అశ్విన్ రూపంలో సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ అందుబాటులో ఉన్నప్పటికీ.. అతడికి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు. అతను కాకుండా దేశవాళీ క్రికెట్లో పేరున్న మరో ఆఫ్‌స్పిన్నర్లు ఎవరూ కనిపించడం లేదు.
Top Spinners In Crickcet :మరోవైపు గత కొన్నేళ్లలో ఆఫ్‌స్పిన్‌కు ప్రపంచ క్రికెట్లో ప్రాధాన్యం తగ్గిపోతూ వస్తుండటం వల్ల వర్ధమాన ఆటగాళ్లలోనూ స్పెషలిస్టు స్పిన్నర్లుగా మారాలనుకునే వారు లెగ్ స్పిన్‌ను ఎంచుకుంటున్నారే తప్ప.. ఆఫ్‌స్పిన్ జోలికి వెళ్లట్లేదు. కేవలం భారతే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అన్ని జట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక అన్ని ప్రధాన జట్లలోనూ స్పెషలిస్టు స్పిన్నర్లంతా మణికట్టును ఉపయోగించి స్పిన్ చేసేవాళ్లే. వేలితో బంతిని తిప్పేవాళ్లు చాలా అరుదు. ప్రధానంగా బ్యాటర్లుగా ఉండి పార్ట్‌టైమ్ స్పిన్ వేసే వాళ్లు మాత్రమే ఆఫ్‌స్పిన్నర్లుగా ఉంటున్నారు తప్ప ఈ కళకు ప్రత్యేకంగా ఎవరూ లేరు.
ఇక ఇంగ్లాండ్ ప్రపంచకప్ జట్టులో ఎంపికైన ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్ అడిల్ రషీద్ మణికట్టు బౌలర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. పార్ట్‌టైమ్ బౌలింగ్ వేసే మొయిన్ అలీ, లివింగ్ స్టోన్ ఆఫ్‌స్పిన్ వేస్తారు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టులోనూ ప్రధాన స్పిన్నర్ ఆడమ్ జంపా లెగీనే. మరో స్పిన్నర్ అస్టాన్ అగార్ ఎడమచేతి వాటం బౌలర్. ఆ జట్టులో పార్ట్‌టైమర్‌లు అయిన మ్యాక్స్‌వెల్, ట్రావిస్ హెడ్ ఆఫ్‌స్పిన్ వేస్తారు. అయితే దక్షిణాఫ్రికా జట్టులో మాత్రం షంసి చైనామన్ బౌలర్. కేశవ్ మహరాజ్ ఎడమచేతి వాటం స్పిన్నర్. పాక్ జట్టులో షాదాబ్ ఖాన్ కూడా లెగీనే. మరో స్పిన్నర్ మహ్మద్ నవాజ్ మాత్రం ఎడమచేతి వాటం. న్యూజిలాండ్ స్పిన్ విభాగంలో రాణిస్తున్న శాంట్నర్, రచిన్ రవీంద్ర ఎడమచేతి వాటం స్పిన్నర్లే.