ODI World Cup 2023 Rohith Sharma :ప్రస్తుత ప్రపంచ కప్ పోటీల్లో టీమ్ ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచుల్లో టీమ్ ఇండియా 5 విజయాలు సాధించి అగ్ర స్థానంలో నిలిచింది. ఈ నెల 29న ఇంగ్లాండ్‌తో తన నెక్ట్స్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి.. తమ విజయపరంపరను కొనసాగించి, డబుల్ హ్యాట్రిక్ విజయాలను అందుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది.
ఇప్పటికే భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా సాధన చేస్తున్నారు. అయితే ఇంగ్లాండ్‌తో జరగబోయే మ్యాచ్‌లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే ఈ మ్యాచ్.. హిట్ మ్యాన్‌కు కెప్టెన్‌గా వందో మ్యాచ్ కావడం విశేషం. కెరీర్‌లో ఇప్పటివరకు 99 మ్యాచుల్లో టీమ్ఇండియాకు సారథ్యం వహించాడు రోహిత్. అందులో 73 మ్యాచ్‌ల్లో జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా టీమ్ ఇండియా మోస్ట్ సక్సెస్‌పుల్ కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. అయితే కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయే ఈ మ్యాచ్‌తో రోహిత్.. మరో అరుదైన రికార్డ్‌పై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో అతడు మరో 47 పరుగులు చేస్తే.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 18,000 పరుగుల మార్క్‌ను అందుకున్న 20వ క్రికెటర్‌గా రికార్డుకెక్కుతాడు.