ODI World Cup 2023 Quinton De Kock : వన్డే ప్రపంచ కప్ - 2023లో భాగంగా ప్రస్తుతం దక్షిణాఫ్రికా - ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ పోరులో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ చరిత్ర సృష్టించాడు. పలు అరుదైన ఘనతలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా జట్టుకు క్వింటన్ డికాక్ అద్భుత సెంచరీతో మంచి శుభారంభం అందించాడు. ఇన్నింగ్స్ 29.5వ ఓవర్లో ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో ఓ సిక్సర్ బాది వంద పరుగులను పూర్తి చేసుకున్నాడు.
దీంతో ప్రపంచకప్-2023లో అతడు వరుసగా రెండోసారి సెంచరీని బాదాడు. తద్వారా అంతర్జాతీయ వన్డేల్లో 19వ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. అలానే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన దక్షిణాఫ్రికా క్రికెటర్ల జాబితాలో చేరాడు. దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్(4) తర్వాత హషీం ఆమ్లా(2), ఫాఫ్ డుప్లెసిస్(2), హర్షల్ గిబ్స్‌లతో(2) సంయుక్తంగా రెండో స్థానాన్ని పంచుకున్నాడు.
ఇంకా దక్షిణాఫ్రికా తరఫున వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన రెండో ఓపెనర్‌గానూ రికార్డు కెక్కాడు. హషీం ఆమ్లా 27 శతకాలతో అగ్రస్థానంలో నిలవగా.. 19 శతకాలతో డికాక్ అతడి తర్వాతి స్థానాన్ని దక్కించుకున్నాడు. అలాగే హర్షల్ గిబ్స్(18)ను కూడా అధిగమించాడు.
ప్రపంచకప్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియాపై అత్యధిక వ్యక్తిగత స్కోరు(109) సాధించిన తొలి దక్షిణాఫ్రికా బ్యాటర్‌గానూ నిలిచాడు. ఈ క్రమంలో హర్షల్ గిబ్స్(1999- 101 పరుగులు) రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో 100 పరుగులతో ఫాఫ్ డుప్లెసిస్(2019) మూడో స్థానంలో నిలిచాడు. మొత్తంగా ఆసీస్‌పై డికాక్‌కు ఇది మూడో సెంచరీ. ఇకపోతే ఈ మ్యాచ్‌లో 34 ఓవర్ ఐదో బంతికి ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ డికాక్‌ను బౌల్డ్ చేశాడు. దీంతో డికాక్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (109) సెంచరీ బాదగా.. ఐడెన్ మార్‌క్రమ్ (56; 44 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. తెంబా బావుమా (35; 55 బంతుల్లో 2 ఫోర్లు), వన్‌డౌన్ బ్యాటర్ వాండర్ డసెన్ (26; 30 బంతుల్లో 2 ఫోర్లు), హెన్రిచ్ క్లాసెన్ (29; 27 బంతుల్లో 3 ఫోర్లు) పర్వాలేదనిపించారు. ఆఖర్లో మార్కో జాన్సన్ (26; 22 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ మిల్లర్ (17; 13 బంతుల్లో) దూకుడుగా ఆడి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఆసీస్ బౌలర్లలో మ్యాక్స్‌వెల్ 2, మిచెల్ స్టార్క్ 2, హేజిల్‌వుడ్, కమిన్స్, ఆడమ్ జంపా ఒక్కో వికెట్ తీశారు.