ODI World Cup 2023 Players Injuries : ప్రపంచకప్ 2023 మెగా టోర్నీ హోరాహోరీగా జరుగుతూ.. రసవత్తరంగా మారింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి పెద్ద టీమ్స్‌కు పసికూన జట్లు షాక్ ఇవ్వటం.. సంచలన విజయాలతో సెమీస్ రేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు అన్ని జట్లు ప్రతీ మ్యాచ్‌ను కీలకంగా తీసుకుంటున్నాయి. అయితే జట్లుకు ప్రత్యర్థుల కంటే మరో విషయం భయపెడుతోంది. అదే తమ కీలక ఆటగాళ్ల గాయాలు. మ్యాచ్‌ల ఫలితాల కన్నా కూడా ప్లేయర్ల గాయాలే జట్లకు ప్రతికూలంగా మారే అవకాశాలు ఎక్కువని చెప్పొచ్చు.
టీమ్ఇండియా విషయానికొస్తే.. వరుస విజయాలతో రేస్‌లో దూసుకుపోతోంది. అయితే తాజాగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయానికి గురి కావటం టీమ్‌కు షాక్ అనే చెప్పాలి. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన బౌలింగ్‌లోనే బంతిని ఆపే ప్రయత్నంలో అతని కుడి కాలు చీలమండకు గాయమైంది. పాండ్య జట్టులో ఎంతో కీలకమైన ఆటగాడు.. ఈ గాయం వల్ల జట్టుపై తీవ్ర ప్రభావం చూపే ఆస్కారముంది. టీమ్ఇండియాలో హార్దిక్ ఒక్కడే పేస్ ఆల్‌రౌండర్. శార్దుల్ ఉన్నపటికీ.. టోర్నీ ప్రారంభమయ్యాక అతని పేలవ బౌలింగ్‌తో నిరాశపరుస్తున్నాడు. దీంతో అయిదో బౌలర్ భారాన్ని హార్దిక్ మోస్తున్నాడు. ప్రస్తుతం ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌ల్లో కలిపి అయిదు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ ఉంటే అటు బౌలింగ్లోను, ఇటు బ్యాటింగ్‌లోనూ జట్టుకు అదనపు అవకాశాలు అందుబాటులో ఉంటాయి. పైగా జట్టుకు వైస్ కెప్టెన్ కూడా. ఇలాంటి ఆటగాడు దూరమైతే జట్టుపై తీవ్ర ప్రభావం ఉంటుంది. అతను త్వరగా కోలుకుని జట్టులోకి రావలన్నది అభిమానుల ఆకాంక్ష.
మరోవైపు మిగతా జట్లకు కూడా ఇలాంటి ఆందోళనే కలవరపెడుతోంది. బంగ్లాదేశ్‌కు కీలక ఆటగాడైన ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ గాయం కారణంగా డగౌట్లో కూర్చోవాల్సి వచ్చింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో షకిబ్‌కు ఎడమ తొడ కండరాల గాయమైంది. దీంతో భారత్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇక న్యూజిలాండ్ సారథి కేన్ విలికయమ్సన్ అయితే గాయాలతో సహవాసం చేస్తున్నాడనే చెప్పాలి. ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ తొలి రెండు మ్యాచ్‌ల్లో విలికయమ్సన్ ఆడలేదు. ఈ ఏడాది ఐపీఎల్లో గాయపడ్డ అతను.. ఏడు నెలల విరామం తర్వాత బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఆడాడు. అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. కానీ, ఫీల్డర్ విసిరిన బంతి బొటనవేలికి తాకడం వల్ల గాయంతో మధ్యలోనే మైదానం వీడాడు. బొటనవేలు విరగడం వల్ల అఫ్గానిస్థాన్ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు.