ODI World Cup 2023 Pakisthan Umpire Call : వన్డే ప్రపంచకప్ 2023లో ఇక దాయాది జట్టు పాకిస్థాన్ టైటిల్ పోరాటం ముగిసింది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతులెత్తేసింది. దక్షిణాఫ్రికాతో ఉత్కంఠగా సాగిన పోరులో బాబర్ సేన ఒక్క వికెట్ తేడాతో పరాజయాన్ని అందుకుంది. 'అంపైర్స్ కాల్' నిబంధనే దాయాది కొంపముంచిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి బౌలర్లకు శాపంగా మారిన ఈ నిబంధనను మార్చాలనే డిమాండ్ చాలా రోజులుగా వినిపిస్తోంది. ఇప్పుడు పాకిస్థాన్ తాజాగా ఓటమిని అందుకోవడంతో ఈ వాదన మరింత బలంగా మారింది. 271 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. అంపైర్స్ కాల్ రూల్‌తోనే ఓటమిని తప్పించుకుంది. ఈ లక్ష్యచేధనలో సౌతాఫ్రికా 260 పరుగులకే 9 వికెట్లను కోల్పోయింది.
దీంతో మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారిపోయింది. పాకిస్థాన్ విజయం సాధించడానికి ఒక్క వికెట్ అవసరం అవ్వగా.. దక్షిణాఫ్రికా విజయానికి 11 పరుగులు కావాలి. అయితే పాకిస్థాన్ పేసర్లు చెలరేగడం వల్ల దక్షిణాఫ్రికా ఓటమి ఖాయం అంని అంతా భావించారు. కానీ సరిగ్గా ఇక్కడే పాకిస్థాన్‌ను దురదృష్టం వెక్కిరించేసరికి.. దక్షిణాఫ్రికా జట్టుకు అదృష్టం కలిసొచ్చింది.
హ్యారీస్ రౌఫ్ వేసిన 46వ ఓవర్ లాస్ట్ బాల్‌కు షంసీ వికెట్ల ముందు దొరికిపోయినట్లు కనిపించింది. దీంతో పాకిస్థాన్ ప్లేయర్స్ గట్టి అప్పీల్ చేయగా.. అంపైర్ ఔట్ ఇవ్వలేదు. వెంటనే బాబర్ అజామ్ రివ్యూ తీసుకోగా.. దురదృష్టం వెంటాడింది. రీప్లేలో అంపైర్స్ కాల్‌గా తేలింది. బాల్ ట్రాకింగ్‌లో బంతి.. లెగ్ స్టంప్‌ను లైట్‌గా తాకడం వల్ల థర్డ్ అంపైర్.. ఫీల్డ్ అంపైర్ డెసిషన్‌కు కట్టుబడి నాటౌట్ అనౌన్స్ చేశాడు. రవూఫ్ వేసిన బంతి మిల్లీ మీటర్ల దూరం కొంచెం లోపలికి పడి ఉండుంటే.. షంసీ ఎల్బీగా వెనుదిరగడంతో పాటు.. దక్షిణాఫ్రికా ఆలౌటై పాకిస్థాన్ గెలిచేది. కానీ పాకిస్థాన్ వెంట్రుకవాసిలో విజయాన్ని చేజార్చుకుంది. ఫైనల్‌గా అంపైర్ నాటౌట్ ఇవ్వడం వల్ల రిజల్ట్ తారుమారైంది.
అంపైర్ కాల్‌పై విమర్శలు... అయితే మ్యాచ్ ఫలితాలను తారు మారు చేస్తున్న అంపైర్ కాల్స్ రూల్‌ను తొలగించాలని సచిన్ తెందుల్కర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు కూడా డిమాండ్ చేశారు. బ్యాటింగ్‌కు ఫేవర్‌గా మారిన క్రికెట్‌లో బౌలర్లకు నష్టం చేస్తున్న అంపైర్ కాల్స్ రూల్‌ను తొలగించాలని కోరుతున్నారు. బాల్ ట్రాకింగ్‌లో బంతి వికెట్లకు తాకితే ఔట్ ఇచ్చేయాలని, తక్కువ శాతం తగులుతున్నా.. బౌలర్లకు అనుకూలంగా ఔట్ ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు. ఇక పాకిస్థాన్ ఓటమికి అంపైరింగ్ తప్పిదాలు, బ్యాడ్ రూల్సే కారణం అయ్యాయని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా దీనిపై స్పందించాడు. బంతి వికెట్‌కు తాకుతున్నట్లు తేలితే అంపైర్ నిర్ణయంతో సంబంధం లేకుండానే ఔట్ ఇవ్వాలని ఐసీసీని డిమాండ్ చేశాడు.
PAK VS SA World Cup 2023 : నరాలు తెగే ఉత్కంఠ.. పాక్‌పై ఒక్క వికెట్ తేడాతో సౌతాఫ్రికా విజయం
Virat Kohli Fitness Diet : వరల్డ్ కప్ కోసం కోహ్లీ ప్రత్యేక డైట్.. ఏం తింటున్నాడో తెలుసా?