ODI World Cup 2023 PAK VS AFG : ప్రపంచకప్ 2023లో అఫ్గానిస్థాన్ రెండో సంచలన విజయాన్ని నమోదు చేసి చరిత్రకెక్కింది. ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ జట్టును మట్టికరిపించిన అఫ్గాన్.. తాజగా పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. మొత్తంగా వన్డే ప్రపంచకప్ చరిత్రలో మూడే మూడు మ్యాచ్‌లు గెలిచిన అఫ్గానిస్థాన్.. అందులో రెండు ప్రస్తుతం టోర్నీలోనే అందుకోవడం విశేషం.
2015 వన్డే ప్రపంచకప్‌లో స్కాట్‌లాండ్‌పై మొదటి విజయాన్ని అందుకున్న అఫ్గాన్.. ఆ తర్వాత 2019 వన్డే ప్రపంచకప్‌లో ఖాతా తెరవలేకపోయింది. అయితే ఈ సారి అఫ్గాన్ రెండు సంచలన విజయాలు అందుకోవడంతో ఓ టీమ్ ఇండియా దిగ్గజ క్రికెటర్ పేరు మార్మోగిపోతోంది. అతడి పేరే అజయ్ జడేజా. ఎందుకంటే.. అతడు అఫ్గాన్ జట్టు మెంటార్. వన్డే ప్రపంచకప్ ముందే అజయ్ జడేజాను అఫ్గాన్ జట్టు మెంటార్‌గా నియమించుకుంది. భారత్ పిచ్‌లు, వాతావరణ పరిస్థితులపై మంచి అవగాహన ఉన్న అతడి సాయంతో ప్రణాళికలను సిద్ధం చేసుకొని ఆ జట్టు బరిలోకి దిగింది.
టీమ్ఇండియా తరపున సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడాడు అజయ్ జడేజా. అతడి అనుభవం అఫ్గాన్‌కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. అందుకే అతడి మార్గదర్శకంలోనే అఫ్గాన్ రెండు భారీ గుర్తుండిపోయే విజయాలను నమోదు చేసింది. దీంతో జడేజా పేరు మార్మోగిపోతోంది. అతడిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ జోనాథన్ ట్రాట్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. జడేజా, జోనాథన్ కలిసి.. ఇద్దరూ అఫ్గాన్ జట్టును సరికొత్త దిశలో తీసుకెళ్తున్నారు. కాగా, గతంలో లాల్‌సింగ్ రాజ్‌పుత్, మనోజ్ ప్రభాకర్(afghanistan cricket indian coach) లాంటి వారు కూడా అఫ్గాన్‌కు కోచ్‌లుగా వ్యవహరించారు.