ODI World Cup 2023 Opening Ceremony :మహా క్రికెట్ సంగ్రామం వన్డే వరల్డ్‌కప్ ప్రారంభోత్సవ వేడుక అంటే ఎలా ఉండాలి. స్టేడియం మొత్తం అభిమానుల ఈలలు, గోలలతో దద్దరిల్లుతూ.. సినీ సెలబ్రిటీల స్టేజ్ షో, డ్యాన్స్ లు, లైటింగ్స్, ఆకాశాన్ని తాకేలా బాణసంచాలతో సందడి సందడిగా.. టాప్ సింగర్స్ గానాలతో ఊర్రూతలూగిపోయేలా ఉండాలి. కానీ 2023 వన్డే వరల్డ్ కప్ అలా లేకపోవడంతో క్రికెట్ అభిమానులు నిరుత్సాహపడుతున్నారు.
ప్రతిష్టాత్మకమైన నరేంద్ర మోదీ స్టేడియంలో టోర్నీ ఆరంభ మ్యాచ్‌కు ముందు ఓపెనింగ్ సెర్మనీ సందడేమీ లేకపోపడం వల్ల.. తెగ బాధపడుతున్నారు. ఓ గొప్ప మెగా టోర్నీని నిర్వాహకులు తూతూమంత్రంగా ప్రారంభించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి ఈ ప్రారంభోత్సవ వేడుక నిర్వహించరని ముందుగానే ప్రచారం సాగింది. కానీ జరుగుతుందేమోనని అభిమానులు ఆశించారు. అయినా అది జరగలేదు.
పైగా టోర్నీ ఆరంభ మ్యాచ్‌ను ప్రత్యేక్షంగా వీక్షించేందుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు తరలివస్తారని అభిమానులు అంతా ఊహించారు. కనీసం అది కూడా జరగలేదు. మ్యాచ్ ప్రారంభమై గంటలు గడుస్తున్నా స్టేడియం మొత్తం ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. దీనిని చూసి నెటిజన్లు, క్రికెట్ అభిమానులు బాగా నిరుత్సాహ పడుతున్నారు. అసలు ఇది వరల్డ్‌కప్ టోర్నీనేనా..అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ వరల్డ్ కప్ గ్లోబల్ అంబాసిడర్ హోదాలో సచిన్ తెందుల్కర్ టోర్నీని అధికారికంగా ప్రారంభించాడనే మాట తప్పించి.. మెగా టోర్నీ ప్రారంభమంతా నామమాత్రంగా సాగడం వల్ల ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు.