ODI World Cup 2023 Netherlands: క్రికెట్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అనేదానికి ప్రస్తుత ప్రపంచకప్.. సరైన ఉదాహరణ. ఈ మెగాటోర్నీలో ఇటీవల డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు.. అఫ్గానిస్థాన్ షాకిచ్చిన మ్యాచ్ మరువక ముందే.. తాజాగా నెదర్లాండ్స్ జట్టు దక్షిణాఫ్రికాను బెంబేలెత్తించింది. తమను చిన్న జట్లే కదా అని తక్కువ అంచనా వేస్తే.. ఎలాంటి పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందో కళ్లారా చూపించాయి ఈ జట్లు.
అయితే నెదర్లాండ్స్ ఒకప్పుడు ప్రపంచకప్‌లో మ్యాచ్‌లు ఆడుతుంటే.. పెద్ద జట్లు ప్రాక్టీస్ చేసుకోవడాని, రికార్డులు నమోదు చేయడానికి మాత్రమే అన్నట్లు చూసేవారు. కానీ, ఇప్పుడు ఈ జట్టును ఏమాత్రం తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక టీ20 లీగ్స్‌లో ఆడుతూ ఆ జట్టు ఆటగాళ్లు రాటుదేలిపోయారు. అలానే వేరే దేశాల నుంచి తెచ్చుకున్న కొందరు ప్రతిభావంతుల వల్ల నెదర్లాండ్స్ బలం పెరిగి.. ప్రస్తుతం ఆ జట్టు ప్రమాదకరంగా మారింది.
డచ్ జట్టు ఎంత ప్రమాదకరమో దక్షిణాఫ్రికాకు ఇదివరకే తెలుసు. గతేడాది టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశలో సఫారీ జట్టు, నెదర్లాండ్స్ చేతిలో ఓటమి పాలైంది. నెదర్లాండ్స్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక దక్షిణాఫ్రికా.. 145/8 కు పరిమితమైంది. ఇకపోతే కొన్ని నెలల కిందట జరిగిన ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లోనూ నెదర్లాండ్స్.. వెస్టిండీస్‌కు పెద్ద ఝలక్ ఇచ్చింది. 375 పరుగుల భారీ ఛేదనలో దిగిన నెదర్లాండ్స్.. స్కోరును సమం చేసి ఇన్నింగ్స్‌ను డ్రాగా ముగించింది. అనంతరం సూపర్ ఓవర్లో విండీస్‌పై గెలిచి సంచలనం సృష్టించింది నెదర్లాండ్స్. ఆ మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తేజ నిడమానూరు (111) సంచలన శతకంతో అదరగొట్టాడు.