తెలంగాణ

telangana

ETV Bharat / sports

World Cup 2023: భారత్‌ నుంచి వన్డే వరల్డ్​ కప్​ ఔట్​! అదే కారణమా?

ODI World Cup 2023 :వన్డే వరల్డ్​ కప్​ 2023 భారత్​ ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో టీమ్​ఇండియా అభిమానులను.. వరల్డ్​ కప్​ భారత్ నుంచి తరలిపోతుందనే వార్త కలవరపెడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అదే నిజం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో క్రికెట్​ ఫ్యాన్స్​ ఆందోళనకు గురవుతున్నారు.

odi world cup 2023
odi world cup 2023

By

Published : Dec 17, 2022, 8:34 PM IST

ODI World Cup 2023 : వన్డే ప్రపంచకప్‌ 2023 వచ్చే ఏడాది అక్టోబర్‌- నవంబర్‌ మధ్య జరగాల్సి ఉంది. ఈ మెగా టోర్నీకి భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసే అవకాశం దక్కుతుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అభిమానుల ఆశలు ఆవిరయ్యేలా కనిపిస్తున్నాయి. అవును! ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023 ఆతిథ్యం భారత్‌ నుంచి తరలిపోయే అవకాశం ఉంది. భారత ప్రభుత్వానికి పన్నుల చెల్లింపు విషయమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ ప్రపంచ కప్ కోసం భారత ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపులను పొందాలని ఐసీసీ.. బీసీసీఐని కోరింది.

టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే దేశాలు ఆ దేశ ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపులను పొందాలని గతంలో ఐసీసీలో నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ విషయంలో భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి పురోగతీ లేదు. దీంతో పన్ను చెల్లింపు విషయంలో తాము ఏమీ చేయలేమని, అవసరమైతే టోర్నమెంట్‌ను భారత్‌లో కాకుండా ఇతర చోట నిర్వహించుకోవచ్చని ఐసీసీకి బీసీసీఐ తెలియజేసినట్లు సమాచారం. 2016 టీ20 ప్రపంచకప్ భారత్‌లో జరిగింది. అప్పుడు కూడా భారత ప్రభుత్వం ఐసీసీకి పన్ను మినహాయింపులు ఇవ్వడానికి నిరాకరించింది. భారత్‌లో చివరిగా వన్డే ప్రపంచకప్‌ 2011లో జరగ్గా.. ధోనీ సారథ్యంలో టీమ్‌ఇండియా విశ్వవిజేతగా నిలిచింది. ఈ వివాదం తొందరగా ముగిసి భారత్‌లోనే ప్రపంచకప్‌ జరగాలని టీమ్‌ఇండియా అభిమానులు ఆశిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details