ODI World Cup 2023 Kohli 49 Century : స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 101* (121 బంతుల్లో 10 ఫోర్లు) సెంచరీతో అదరగొట్టిన వేళ టీమ్ ఇండియా 327 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందుంచింది. విరాట్ సెంచరీకి తోడు శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ, రోహిత్ శర్మ మెరుపులు మెరిపించడంతో.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 326 పరుగుల భారీ స్కోరు చేసింది.
కెప్టెన్ రోహిత్ శర్మ (40 పరుగులు, 24 బంతుల్లో, 6x4, 2x6) జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. వేగంగా ఆడే క్రమంలో 5.5 ఓవర్ వద్ద రబాడా బౌలింగ్లో క్యాచౌట్గా పెవిలియన్ చేరాడు రోహిత్. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ (23 పరుగులు) కూడా త్వరగానే ఔటయ్యాడు. కేశవ్ మహరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే మొదటి 5 ఓవర్లలోనే 61 పరుగులు చేసింది భారత జట్టు. వన్డేల్లో టీమ్ఇండియాకు మొదటి 5 ఓవర్లలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.