ODI World Cup 2023 IND VS PAK : టీమ్ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల్లో ఉండే ఆసక్తే వేరు. టీవీలకు అతుక్కుపోతారు. అయితే ఈ ఆసక్తికి తగ్గట్లుగా చిరకాల ప్రత్యర్థుల మ్యాచులు ప్రస్తుతం జరగకపోవడం నిరాశ కలిగిస్తోంది. ఈ మధ్య చాలా వరకు ఈ రెండు జట్ల మ్యాచ్‌లు ఏకపక్షం అవుతున్నాయి. ఎక్కువగా భారతే విజయం సాధిస్తుండటం సంతోషకర విషయమేనైనా... ఆ మ్యాచ్‌లన్నీ ఏకపక్షం కావడం నిరాశగా ఉంది. చివరి వరకు ఉత్కంఠ నెలకొనడం లాంటి దృశ్యాలు కనుమరుగైపోతున్నాయి.
ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ మీద భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ మ్యాచ్ అస్సలు మజానే ఇవ్వలేదు. పోటాపోటీగా సాగలేదు. పాక్ ఇన్నింగ్స్ ఒక దశ వరకు పోటాపోటీగానే సాగినా.. 29 ఓవర్లకు 150/2తో నిలిచినా.. ఆ తర్వాత తుస్సు మనిపించింది. ఉన్నట్లుండి కుప్పకూలి చివరికి 191 పరుగులకే పరిమితమైంది. తర్వాత లక్ష్యాన్ని భారత్ ఉఫ్ అంటూ ఊదేసింది. దీంతో ప్రేక్షకులు మ్యాచ్ పట్ల ఆసక్తి కోల్పోయారు. వాస్తవానికి ఈ మ్యాచ్ అనే కాదు.. గత కొన్నేళ్లలో భారత్-పాక్ మ్యాచ్‌లు అన్నీ ఇలానే సాగుతున్నాయి.
చరిత్రలో ఇలా జరగలేదు.. ఒకప్పుడు పాక్‌పై విజయాలు అంత తేలిగ్గా రాలేదు. ఎందుకంటే 90వ దశకంలో పాక్ జట్టు చాలా బలమైనది. 1992లో ఆ జట్టు తొలి ప్రపంచకప్ గెలిచింది. అయితే ఆ సమయంలోనే అదే టోర్నీలో భారత్ చేతిలో తొలి పరాజయాన్ని పాక్ చూసింది. ఆ పోరులో భారత్ నిర్దేశించిన 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది.
1996లోనూ భారత్ 288 పరుగుల లక్ష్యాన్ని.. పాక్ ఛేదించేలా కనిపించినా చివరికి ఓడింది. 1999లో భారత్ 6 వికెట్లకు 227 పరుగులే చేసినా... పాక్‌ను 180కే కట్టడి చేసింది. 2003లో సచిన్ అసాధారణ ఇన్నింగ్స్‌తో ఛేదనలో భారత్ ఘన విజయం సాధించింది. 2011 ప్రపంచకప్ సెమీస్‌లోనూ పాక్ గట్టి పోటీనే ఇచ్చింది. అలా ఈ మ్యాచ్‌లన్నీ రసవత్తరంగా మస్త్ మజాను ఇస్తూ సాగాయి.
పరిస్థితి మారిపోయింది... కానీ 2015 నుంచి అంతా మారిపోయింది. మ్యాచ్‌లు ఏకపక్షం అయిపోయాయి. 2015 టోర్నీలో టీమ్ఇండియా 301 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే పాక్ 224 పరుగులకే చాప చుట్టేసింది. 2019లో భారత్ 5 వికెట్లకు 336 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ.. వర్షం వల్ల లక్ష్యాన్ని 40 ఓవర్లకు 302గా కుదించారు. పాక్ 212/6కు పరిమితమవ్వాల్సి వచ్చింది. ప్రస్తుత టోర్నీలోనూ ఇలానే చప్పగా సాగుతోంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2021 టీ20 వరల్డ్ కప్‌లో పాక్ గెలిచినప్పటికీ.. మ్యాచ్‌లు ఏకపక్షంగానే సాగాయి. ఈ రెండు మ్యాచుల్లోనూ భారత్ గట్టి పోటీ ఇవ్వలేక చతికిల పడింది. 180 పరుగులు, 10 వికెట్ల తేడాతో ఓడిపోయి నిరాశ కలిగించింది.
మొత్తంగా గత దశాబ్ద కాలంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్ ఒక్కటే. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో జరిగినదే. ఆ మ్యాచ్ చివరి బంతి వరకు మంచి ఉత్కంఠభరితంగా కొనసాగి ప్రేక్షకులకు మంచి మజాను ఇచ్చింది. 160 పరుగుల ఛేదనకు దిగిన టీమ్ ఇండియా తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోగా.. కోహ్లీ 82 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ ఫుల్ మజాని ఇచ్చింది. అదే మజాను ఇప్పుడు చూస్తామనుకుంటే.. కనపడట్లేదు. తర్వాత మ్యాచుల్లోనైనా ఈ మజా కనిపిస్తుందేమో చూడాలి...
Ind vs Pak World Cup 2023 : దాయాదుల సమరంలో మనోళ్ల ఫన్నీ రియాక్షన్స్.. నెట్టింట ఇప్పుడు ఇవే ట్రెండ్.. మీరు చూశారా?