ODI World Cup 2023 IND vs ENG: 2023 ప్రపంచకప్‌లో భారత్ హవా కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతోంది. తొలుత బ్యాటింగ్ విభాగానికి ఎదురైన పరీక్షలో దిగ్విజయంగా సఫలీకృతం కావటం.. ఇప్పుడు బౌలింగ్‌లోనూ అద్భుతంగా రాణిస్తోంది. ఒక్కో సవాల్‌ను అధిగమిస్తూ.. టైటిల్‌ను కైవసం చేసుకునే దిశగా టీమ్ఇండియా పయనం సాగుతోంది. అయితే ఆడిన ఆరు మ్యాచుల్లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ భారత్‌కు ఎంతో ప్రత్యేకం. ఇంగ్లాండ్‌పై ఆషామాషీగా వచ్చిన గెలుపు కాదు ఇది. టీమ్ఇండియా బౌలింగ్ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన మ్యాచ్.
అది అంత సులువు కాదు..టీమ్ఇండియా గెలిచింది అని ఇంగ్లాండ్‌తో మ్యాచ్ స్పెషల్ అంటున్నారని అనుకోవద్దు. ఎందుకంటే ఇంగ్లాండ్ జట్టులో స్టార్ బ్యాటర్లే ఉన్నారు. బ్యాటర్లను పెవిలియన్‌కు పంపిచటం సులువైన విషయం కాదు. దానికి ఎంతో నిబద్ధత, బౌలింగ్‌లో క్రమశిక్షణ అవసరం. అదేంటనేది భారత్ ఆడిన గత ఐదు మ్యాచులను.. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లను చూస్తే అర్థమైపోతుంది. ఆ ఐదు మ్యాచ్‌ల్లో మొదట టీమ్ఇండియా బౌలింగ్ చేసింది. పిచ్, వాతావరణ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని ఆయా మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులను కట్టడి చేసింది. అలానే బ్యాటర్లు చెలరేగి విజయాలను అందించారు. కానీ, ఇంగ్లాండ్‌తో మాత్రం ఛేదన సమయంలో బౌలింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇకపోతే ఇంగ్లాండ్‌కు నిర్దేశించిన లక్ష్యం కూడా భారీగా లేదు. టార్గెట్ 230 పరుగులు మాత్రమే. అప్పటికే వరుసగా ఓటములను చవిచూస్తున్న ఇంగ్లాండ్ చెలరేగిపోతుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే జట్టులో స్టార్ బ్యాటర్లు ఉన్నారు. దానికి తోడు తేమ ప్రభావం అధికంగా ఉండే పిచ్ కావటం వల్ల అనేక అనుమానాలు వచ్చాయి. కానీ, భారత్ బౌలింగ్ విభాగం లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి మరీ బంతిని సంధించడం వల్ల ఇంగ్లాండ్ బ్యాటర్లు ఏ మాత్రం నిలవలేకపోయారు. దీంతో 129 పరుగులకే ఆలౌట్ అవ్వటం విశేషం. ఇక గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌ను.. ఇంగ్లాండ్ పది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇప్పుడు ఆ ఓటమికి టీమ్ఇండియా ప్రతీకారం తీర్చుకున్నట్లైంది.
అద్భుతమై బౌలింగ్.. భారత బౌలర్ల బంతులకు ఇంగ్లాండ్ బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. ముందుగా బుమ్రా వికెట్లు పడగొట్టి బ్యాటర్లకు ఒత్తిడి పెంచాడు. తర్వాత షమీ వచ్చాక ఇంగ్లాండ్ పతనం వేగంగా సాగింది. అతడి బౌలింగ్‌ను ఆడేందుకు ప్రత్యర్థి బ్యాటర్లు తీవ్రంగా శ్రమించారు. ఆరుగురు బ్యాటర్లు బౌల్డ్ కావడం, ఇద్దరు ఎల్బీ, ఒక క్యాచ్, ఒక స్టంపౌట్ అయ్యారంటే భారత బౌలింగ్ పదును ఎంత అద్భుతంగా ఉందో తెలిసిపోతుంది. స్టంప్స్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని బౌలింగ్‌తో దాడి చేశారు. మొత్తం 10 వికెట్లలో ఏడు పేసర్లు తీయగా.. మూడు స్పిన్నర్లుకు దక్కాయి. కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ స్పెల్‌లో మార్పులు చేయటం కూడా టీమ్ఇండియాకు కలిసొచ్చింది.