ODI World Cup 2023 :ఓపెనర్లు డకౌట్.. అందులోనూ ఒకటి గోల్డెన్ డక్. నాలుగో స్థానంలో వచ్చిన బ్యాటర్ కూడా పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు. సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లో తమ తొలి మ్యాచ్‌లోనే టీమ్ ఇండియా పరిస్థితి ఇది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాతో టాస్ ఓడి మొదట బౌలింగ్ చేసిన టీమ్ఇండియా.. ప్రత్యర్థి జట్టును 199 పరుగులకే కట్టడి చేసేసింది. దీంతో స్వల్ప లక్ష్యాన్ని సులభంగానే ఛేదిస్తుందని అభిమానులు అంతా ఆశించారు. కానీ అంచనాలు తలకిందులైపోయాయి.
ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్, జోష్ హెజిల్ వుడ్ ఆ ఆనందాన్ని ఎక్కువసేపు ఉంచనివ్వలేదు. స్టార్క్ ఇషాన్‌ను పెవిలియన్‌కు పంపగా.. రోహిత్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా ఔట్ అయిపోయాడు. 2 పరుగులకే.. 3 వికెట్లు.. కోల్పోయి కష్టాల్లోకి వెళ్లిన సమయంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చారు. అప్పుడు విరాట్ కొన్ని అద్భుత షాట్లతో అలరించి దూకుడుగా ఆడాడు. ఆరో ఓవర్ ఐదో బాల్‌కు.. హెజిల్‌వుడ్ బౌలింగ్‌లో అదిరిపోయే ఫోర్‌తో దుమ్ములేపాడు. అనంతరం మళ్లీ 11వ ఓవర్ వరకు టీమ్ ఇండియా ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ కూడా లేదు.
ఇలాంటి సమయంలో కోహ్లీ ఒక్కసారిగా భయపెట్టేశాడు! అతడు బాదిన క్యాచ్‌ను మిచెల్ మార్ష్ పట్టుకోబోయేవాడు. కానీ జస్ట్ మిస్ అవ్వడం వల్ల టీమ్ ఇండియా ఊపిరి పీల్చుకుంది. టీమ్ ఇండియా ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ వేసిన హెజిల్‌వుడ్... కోహ్లీకి షార్ట్‌బాల్‌ను వేశాడు. బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. అప్పుడు మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మిచెల్ మార్ష్ సహా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ బాల్‌ను పట్టుకునేందుకుపరిగెత్తుకు వచ్చారు. మార్ష్ బంతిని క్యాచ్ పట్టబోయి.. పట్టుతప్పి జారవిడిచాడు. లేదంటే టీమ్ ఇండియా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేది. ఇక కోహ్లీ అక్కడి నుంచి నిలకడగా ఆడుతూ ముందుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
రోహిత్ అరుదైన రికార్డ్.. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో టీమ్ఇండియాకు సారథ్యం వహించిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డుకెక్కాడు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ సందర్భంగా బరిలోకి దిగిన రోహిత్.. ఈ మార్క్‌ను అందుకున్నాడు. రోహిత్ 36 ఏళ్ల 161 రోజుల వయసులో వరల్డ్ కప్ మ్యాచ్‌లో టీమ్ ఇండియాకు నాయకత్వం వహిస్తున్నాడు. అంతకుముందు ఇలాంటి మార్క్.. భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ (36 ఏళ్ల 124 రోజులు) పేరిట ఉండేది. ఇప్పుడు తాజా మ్యాచ్‌తో అజారుద్దీన్ ఆల్‌టైమ్ రికార్డును రోహిత్ అధిగమించాడు. రోహిత్ తర్వాత అజారుద్దీన్ కాకుండా రాహుల్ ద్రవిడ్ (34 ఏళ్ల 71 రోజులు), ఎస్ వెంకట రాఘవన్(34 ఏళ్ల 56 రోజులు), ఎంఎస్ ధోనీ(33 ఏళ్ల 262 రోజులు) ఉన్నారు.