ODI World Cup 2023 England Team :ఆస్ట్రేలియా జట్టు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు కంగారు జట్టుతో తలపడాలంటే ప్రత్యర్థి జట్లు భయపడేవి! అయితే ఇప్పుడు దాదాపుగా అలాంటి భయాన్నే కలిగిస్తున్న టీమ్ ఇంగ్లాండ్. దూకుడుగా ఆడుతూ.. ప్రత్యర్థులను భయపెడుతోంది. అదే దూకుడైన ఆటతో 2019లో ఛాంపియన్‌గా నిలిచి వన్డే ప్రపంచకప్ కలను నేరవేర్చుకుంది. ఇప్పుడు మరోసారి ఫేవరెట్ జట్లలో ఒకటిగా బరిలోకి దిగబోతుంది.
సొంతగడ్డపై భారీ అంచనాలతో టీమ్ ఇండియా వరల్డ్ కప్ బరిలోకి దిగబోతుండగా.. భారత్ దిగ్గజ ఆటగాడు గావస్కర్ టీమ్ఇండియాను కాదని ఇంగ్లాండ్‌నే టైటిల్ ఫేవరెట్‌గా పేర్కొనడం గమనార్హం. గత సారి కూడా ఎక్కువ మంది ఆ టీమ్‌నే ఫేవరెట్‌గా పేర్కొనగా.. అంచనాలను నిలబెట్టుకుంటూ కప్‌ను ముద్దాడింది ఇంగ్లిష్ జట్టు. వరల్డ్ కప్ వైఫల్యం తర్వాత జట్టులో సమూల మార్పులు చేసిన ఆ జట్టు.. ప్రస్తుతం దూకుడైన ఆటతీరుతో మేటి జట్టుగా ఎదిగింది. 2019 విజయం తర్వాత నుంచి అదే ఊపును కొనసాగిస్తూ దూసుకుపోతోంది.
England Team strengths :జట్టు బలాలు.. ఇతర ఏ జట్టుకు లేనంత లోతైన బ్యాటింగ్, ఆల్‌రౌండ్ బలం, దూకుడైన ఆటతీరు ఇంగ్లాండ్‌కు కలిసొచ్చే అంశాలు. లోయర్ ఆర్డర్లో ఆడే సామ్ కరన్, విల్లీ కూడా మంచిగా బ్యాటింగ్‌లో రాణించగలరు. మలన్, బెయిర్‌స్టో, రూట్, బ్రూక్, లివింగ్‌స్టన్, స్టోక్స్, మొయిన్ అలీ, బట్లర్.. ఇలా లోతైన బ్యాటింగ్ బలం ఆ జట్టుకుంది.
టెస్టు బ్యాటర్ రూట్ కూడా ఈ మధ్య దూకుడుగా బాగా పెంచేశాడు. వరల్డ్ కప్ కోసం స్టోక్స్ తిరిగి జట్టులోకి రావడం కూడా ఆ టీమ్‌కు బలం ఇంకాస్త పెరిగింది. ఎక్కువ మంది ఆల్ రౌండర్లు అందుబాటులో ఉండటం వల్ల.. వారిలో కొందరు రాణించలేకపోయినా మరి కొందరు అందుకుంటున్నారు. ఇవే ఈ జట్టు ప్రధాన బలాలు.