ODI World Cup 2023 England Performance: అగ్రశ్రేణి బ్యాటర్లు.. ప్రమాదకర బౌలర్లు.. ఇలా మొత్తంగా స్టార్ క్రికెటర్లతో నిండిన జట్టు ఇంగ్లాండ్. ప్రత్యర్థి జట్లను చావుదెబ్బ కొడుతూ.. అసలు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా.. విజయాల వేటలో సాగేది ఇంగ్లాడు టీమ్. అందుకే ఈ ప్రపంచకప్‌లోనూ టైటిల్ ఫేవరెట్‌గా ఆ జట్టును పరిగణించారు. కానీ, ఇప్పుడు చూస్తే అంతా తలకిందులైంది. నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఓటములను చవిచూసింది. సెమీస్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగిన ఇంగ్లాండ్.. తన స్థాయికి తగ్గట్టు ఆడటంలో విఫలమవుతోంది.
ప్రపంచకప్ ఆరంభంలోనే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓటమిపాలైంది. తరువాత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయంతో పుంజుకుంటుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా పసికూన అఫ్గాన్ చేతిలో ఓటమిని ఎదుర్కొంది. ఇప్పుడు సఫారీ చేతిలో 229 పరుగుల తేడాతో ఓడి చెత్త పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ పరిస్థితుల్లో ఇంగ్లాండ్ సెమీస్ రేసులో ఉండాలంటే ఆడబోయే అయిదు మ్యాచ్‌లూ గెలవాల్సిందే.
2015 రిపీట్ అవుతుందా..అయితే ఇంగ్లాండ్ 2015 ప్రపంచకప్‌లోనూ ఇలాగే పేలవ ప్రదర్శన చేసింది. అప్పుడు 6 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించింది. దీంతో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. తరవాత ఆ జట్టు పూర్తిగా మారిపోయి.. దూకుడైన ఆటతీరుతో 2019 వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌నూ సొంతం చేసుకుంది. ఆ రెండు సందర్భాల్లోనూ ఉన్న కీలక ప్లేయర్లే.. ప్రస్తుత జట్టులో ఉన్నారు. కానీ, ఇప్పుడు జట్టుల ఓడిన తీరు మరితం షాక్‌కు గురిచేస్తోంది. ఎలాంటి పోరాటం లేకుండానే చేతులెత్తేస్తోంది. స్టార్ క్రికెటర్లు ఉన్నా.. ఇంగ్లాండు జట్టు గెలవలేకపోతుంది. అందుకు సమష్టిగా సత్తాచాటలేకపోవడం.. అంచనాలకు తగ్గట్లుగా స్టార్ క్రికెటర్లు రాణించలేకపోవడమే ప్రధానం కారణమని అంటున్నారు.
2019 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ పేసర్ ఆర్చర్, ఆల్‌రౌండర్ స్టోక్స్ కీలక పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు గాయం నుంచి కోలుకుంటన్న ఆర్చర్ రిజర్వ్ ఆటగాడిగా జట్టుతో కొనసాగుతున్నాడు. ఇక తుంటి గాయం కారణంగా తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన స్టోక్స్.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో అడుగు పెట్టనా లయ అందుకోలేక వికెట్ పారేసుకున్నాడు. ఇకపోతే బెయిర్ స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, బట్లర్ లాంటి బ్యాటర్లు.. మొయిన్ అలీ, సామ్ కరన్, లివింగ్‌స్టోన్, బెన్ స్టోక్స్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్ లాంటి ఆల్‌రౌండర్లు.. అట్కిన్సన్, రషీద్, రీస్ టాప్లీ, మార్క్‌వుడ్ లాంటి బౌలర్లు ఉన్నారు. కానీ జట్టు గెలవలేకపోతోంది.