ODI World Cup 2023 Afghanistan Records : ప్రపంచకప్ 2023లో అఫ్గానిస్థాన్ సంచలన విజయాలను నమోదు చేస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను ఓడించి పెను సంచనలమే సృష్టించింది. ఆ విజయం గురించి క్రికెట్ అభిమానులు ఇంకా మాట్లాడుకోవటం మానలేదు. అంతలోనే మరో సంచలన విజయం సాధించింది. తాజాగా పాకిస్థాన్‌ను ఊహించని విధంగా చిత్తు చేసింది. అఫ్గాన్ ప్లేయర్లు మరీ అంత సులవుగా ఇంగ్లాండ్, పాకిస్థాన్ లాంటి జట్లను ఓడించేస్తుందని ఎవరూ అనుకోని ఉండరు. అయితే సోమవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన అఫ్గానిస్థాన్ కొన్ని రికార్డులను నమోదు చేసుకుంది.
- అప్గానిస్థాన్ వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. గతంలో 2015లో స్కాట్లాండ్ను ఓడించింది. ఈ ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను మట్టికరింపించిన అఫ్గాన్ ఇప్పుడు పాక్‌ను చిత్తు చేసింది.
- వన్డేల్లో పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్‌కి ఇదే తొలి విజయం. ఇప్పటి వరకు పాకిస్థాన్‌తో మొత్తం ఎనిమిది మ్యాచ్‌ల్లో అఫ్గాన్ తలపడగా... పాక్ ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అఫ్గాన్ మాత్రం తొలిసారి గెలిచింది.
- వరల్డ్ కప్ టోర్నీల్లో అఫ్గాన్ చేసిన అత్యధిక స్కోర్ల జాబితాలో ఈ మ్యాచ్ రెండోది. అంతకుముందు 2019 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై 288 పరుగులు చేసింది. ఇప్పుడు పాక్‌పై 286 రన్స్ చేసింది.
- వన్డేల్లో అత్యధిక లక్ష్య ఛేదనను మాత్రం అఫ్గాన్ ఇప్పుడే చేసింది. ఈ మ్యాచ్ ముందు వరకు.. యూఏఈపై 2014లో 274 పరుగులను ఛేదించి అఫ్గాన్ విజయం సాధించింది. ఇక వరల్డ్ కప్‌లో పాక్‌పై అత్యధిక టార్గెట్‌ను ఛేదించిన జట్టుగానూ అఫ్గాన్ నిలిచింది.
- వన్డే వరల్డకప్‌లో ఒకే మ్యాచ్‌లో స్పిన్నర్లతో అత్యధిక ఓవర్లు వేయించిన మ్యాచ్‌ల్లో ఇది మూడోది. 2019లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 60 ఓవర్లు వేయగా.. ఇప్పుడు 59 ఓవర్లు వేశారు. అంతకుముందు 2011లో భారత్- ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 59 ఓవర్లు స్పిన్నర్లే వేశారు.
- ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ స్పిన్నర్లు 38 ఓవర్లు వేసి 176 పరుగులకు 4 వికెట్లు తీశారు. పాక్ స్పిన్నర్లు మాత్రం 21 ఓవర్లు వేసి 131 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు.
- వన్డే ప్రపంచకప్‌ల్లో అఫ్గానిస్థాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రహ్మత్ షా (404) నిలిచాడు. ఆ తరువాత హష్మతుల్లా షాహిది (365), నజ్ముల్లా జాద్రాన్ (360) ఉన్నారు.
- పాకిస్థాన్ వన్డే ప్రపంచకప్ పోటీల్లో 275+ టార్గెట్‌ను కాపాడుకోలేకపోవడం ఇదే తొలిసారి. మొత్తం 14 మ్యాచుల్లో 13 మ్యాచుల్లో గెలవగా.. ఈసారి మాత్రం ఓటమిని చవిచూసింది.