ODI World cup 2022 Indian Womens Cricket Team: రెండు సార్లు ఫైనల్! ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల ఆధిపత్యం సాగుతోన్న మహిళల ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా అత్యుత్తమ ప్రదర్శనిది. కప్పు కల ఇంకా కలగానే ఉంది. ఆ కల నెరవేర్చుకోవడానికి ఇప్పుడు మరోసారి సమరానికి సిద్ధమైంది భారత్. మరి ప్రపంచకప్పులో మిథాలీసేన అవకాశాలేంటి? బలాలేంటి.. బలహీనతలేంటి? ఓసారి పరిశీలిద్దాం!
భారత మహిళల జట్టు ఎన్నో ఆశలతో న్యూజిలాండ్‌లో అడుగుపెట్టింది. ఎనిమిది జట్ల టోర్నీలో ఫేవరెట్టేమీ కాదు కానీ.. మన జట్టు గట్టి పోటీదారేనని అనడంలో సందేహం లేదు. గత ప్రపంచకప్ (2017) ఫైనల్లో ఓడిన భారత్.. ఈసారి పట్టుదలతో ఉంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా చాలా రోజులు ఆటకు దూరమై.. తిరిగి మొదలెట్టాక ఆ జట్టు ప్రదర్శన అత్యంత పేలవం. సరైన ప్రాక్టీస్ లేని భారత్.. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాకు సిరీస్‌ను కోల్పోయింది. ఆ తర్వాత ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ సిరీస్‌లను చేజార్చుకుంది. ప్రపంచకప్ ముంగిట తాజాగా కివీస్ పర్యటనలోనూ భంగపడింది. 1-4తో సిరీస్‌లో పరాజయంపాలైంది. ఈ ప్రదర్శన కచ్చితంగా జట్టుపై అంచనాలను గణనీయంగా తగ్గించింది. అయితే ఓడిపోయినా.. ఆ సిరీస్‌లో 250+ స్కోర్లు సాధించడం సానుకూలాంశం. ఈ నెల 6న ప్రపంచకప్ తొలి మ్యాచ్ (పాకిస్థాన్‌తో)కు ముందు ఫామ్‌ను అందుకుని, రెండు సన్నాహక మ్యాచ్‌ల్లో గెలవడం మిథాలీ బృందం ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. అసలు టోర్నీలో ఎలా రాణిస్తారో చూడాలి.
ఇదీ బలం..: కాగితంపై చూస్తే భారత జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. స్మృతి మంధాన రూపంలో స్టార్ ఓపెనర్ భారత్ సొంతం. ఆమె దూకుడుగా ఆడగలదు, అవసరమైతే సంయమనంతో బ్యాటింగ్ చేస్తూ ఎక్కువ సేపు క్రీజులో నిలిచి ఇన్నింగ్స్‌ను నిర్మించగలదు. ధనాధన్ బ్యాటింగ్‌తో మెరుపు ఆరంభాలనిచ్చే యువ షెఫాలీ వర్మ కూడా జట్టులో ఉండడం భారత్‌కు బలం. బంతి ఏమాత్రం గతి తప్పినా..షెఫాలీ శిక్షించకుండా వదలదు. ఆమె సామర్థ్యం మేరకు రాణిస్తే భారత్‌కు తిరుగుండదనడంలో సందేహం లేదు. అయితే టీ20ల్లో ఇప్పటికే సత్తా చాటుకున్న ఆమె.. 50 ఓవర్ల ఫార్మాట్లో మాత్రం తనను తాను నిరూపించుకోవాల్సివుంది. ఇక అత్యంత అనుభవజ్ఞురాలైన కెప్టెన్ మిథాలీ రాజ్ సుదీర్ఘ ఇన్నింగ్స్‌తో జట్టుకు వెన్నెముకలా నిలుస్తుంది. ఆమె రికార్డు చూస్తేనే అది అర్థమవుతుంది. ఇటీవల న్యూజిలాండ్‌తో సిరీస్‌లో మూడు అర్ధశతకాలు సాధించిన ఆమె.. గతంలో కంటే వేగంగా పరుగులు రాబట్టింది. 21 ఏళ్ల యాస్తిక భాటియా కూడా బ్యాటుతో ఆశలు రేపుతోంది. మిడిల్ ఆర్డర్‌లో హర్మన్‌ప్రీత్ లాంటి బ్యాటర్ ఉండడం భారత్‌కు సానుకూలాంశమే. అయితే ఆమె ఫామ్‌ను అందుకోవడం ముఖ్యం. అనుభవజ్ఞురాలైన దీప్తి శర్మ, వికెట్‌కీపర్ రీచా ఘోష్ కూడా ఉన్న భారత బ్యాటింగ్ లైనప్‌కు జట్టు స్కోరును 270 దాటించే సత్తా ఉంది. ఈ బ్యాటింగ్ దళం సమష్టిగా రాణిస్తే ప్రపంచకప్‌లో ప్రత్యర్థులకు ఇబ్బందులు తప్పవు.