సొంతగడ్డపై శ్రీలంకతో జరుగుతున్న రెండు టెస్ట్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ తన జోరును కొనసాగిస్తోంది. తొలి టెస్ట్‌లో ఆఖరి బంతికి గెలిచిన కివీస్.. రెండో టెస్ట్‌లోనూ భారీ స్కోర్ నమోదు చేసింది. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (296 బంతుల్లో 23 ఫోర్లు, 2 సిక్స్‌లతో 215), హెన్రీ నికోల్స్ (240 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 200 నాటౌట్) డబుల్ సెంచరీలతో చెలరేగడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 580/4 స్కోర్ వద్ద డిక్లేర్ ఇచ్చింది. ఈ ఇద్దరికి తోడుగా ఓపెనర్ డెవాన్ కాన్వే (108 బంతుల్లో 13 ఫోర్లతో 78) హాఫ్ సెంచరీతో రాణించాడు. శ్రీలంక బౌలర్లలో కసున్ రజితా రెండు వికెట్లు తీయగా.. ధనుంజయ డిసిల్వా, ప్రబత్ జయసూర్య తలో వికెట్ పడగొట్టారు.
డబుల్ సెంచరీతో కేన్ మామ అరుదైన రికార్డును దక్కించుకున్నాడు. కెరీర్‌లో 6వ డబుల్ సెంచరీ నమోదు చేసిన కేన్.. అత్యధిక డబుల్ సెంచరీలు బాదిన జాబితాలో దిగ్గజాల సరసన నిలిచాడు. సచిన్ తెందూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, మార్వన్ ఆటపట్టు, జావెద్ మియాందాద్, యూనిస్ ఖాన్, రికీ పాంటింగ్‌ల రికార్డును కేన్ మామ సమం చేశాడు. అత్యధిక డబుల్ సెంచరీల జాబితాలో డాన్ బ్రాడ్‌మన్ 12 డబుల్ సెంచరీలతో టాప్‌లో ఉన్నాడు. అతడు 52 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు.