Nz vs Pak World Cup 2023 :2023 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్.. న్యూజిలాండ్‌పై డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 21 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ జెట్ స్పీడ్‌తో పరుగులు సాధించింది. ఫకర్ జమాన్ (126* పరుగులు, 81 బంతుల్లో; 8x4, 11x6), బాబర్ అజామ్ (66* 63 బంతుల్లో; 6x4, 2x6) మెరుపులకు కొండంత లక్ష్యం కరిగిపోతూ వచ్చింది. ఇక మ్యాచ్ మధ్యలో వర్షం పలుమార్లు అంతరాయం కలిగించింది.
దీంతో తొలుత పాక్ లక్ష్యాన్ని 41 ఓవర్లకు 341కు కుదించారు. కాసేపటికి ఆట ప్రారంభమయ్యాక 25.3 ఓవర్ల వద్ద మరోసారి వర్షం వచ్చింది. అప్పటికి పాక్ 200-1తో నిలిచింది. అయితే డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 25.3 ఓవర్లకు 179 పరుగులు చేస్తే చాలు. కానీ, పాక్ అంతకంటే ఎక్కువే చేయడం వల్ల పాకిస్థాన్ విజేతగా నిలిచింది. సౌథీ ఒక వికెట్ పడగొట్టాడు. సూపర్ సెంచరీతో అదరగొట్టిన ఫకర్ జమాన్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన కివీస్ బ్యాటర్లు కూడా ఆశకామే హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా యంగ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర(108) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ విలియమ్సన్ (95) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. ఓపెనర్ డేవన్ కాన్వే (35), చాప్మన్ (39), గ్లెన్ ఫిలిప్స్ (41) రాణించారు. పాక్ బౌలర్లలో మహ్మద్ వసీమ్ జాఫర్ 3, హారిస్ రౌఫ్, ఇఫ్తికార్ అహ్మద్, హసన్ అలీ తలో వికెట్ పడగొట్టారు.