తెలంగాణ

telangana

ETV Bharat / sports

Nz vs Bangladesh: బంగ్లా చారిత్రక విజయం.. కివీస్​ గడ్డపై ఇదే తొలిసారి

Nz vs Bangladesh: న్యూజిలాండ్​తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్​ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో రెండు మ్యాచ్​ల సిరీస్​లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. కివీస్​ గడ్డపై బంగ్లాకు ఇదే తొలి విజయం.

By

Published : Jan 5, 2022, 7:14 AM IST

Updated : Jan 5, 2022, 9:23 AM IST

nz vs bangladesh
బంగ్లాదేశ్​ విజయం

Nz vs Bangladesh: న్యూజిలాండ్​తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్​ ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. 8 వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించి.. కివీస్​ గడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్​లో ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్ అవార్డు ఎబాదత్​ హుస్సేన్​కు దక్కింది. ఈ విజయంతో రెండు మ్యాచ్​ల సిరీస్​లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ​రెండో ఇన్నింగ్స్​లో 39 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లా.. 16.5ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది.

ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచిన బంగ్లా ఫీల్డింగ్ ఎంచుకుంది. అనంతరం తొలి ఇన్నింగ్స్​లో కివీస్​ను 328 పరుగులకే ఆలౌట్ చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో కాన్వే (122) సెంచరీతో మెరవగా నికోలస్ (75), విల్ యంగ్ (52) ఆకట్టుకున్నారు. తర్వాత తొలి ఇన్నింగ్స్​లో బంగ్లాదేశ్ 458 పరుగులకు ఆలౌటైంది. మొమినుల్ (88), లిటన్ దాస్ (86), మహ్మదుల్ హసన్ (78), షంటో (64) రాణించారు. దీంతో మొదటి ఇన్నింగ్స్​లో బంగ్లాకు 130 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్​లో న్యూజిలాండ్​ 169 పరుగులకే కుప్పకూలగా.. 39 పరుగల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్​లో బరిలో దిగిన బంగ్లా లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది.

ఇది సమష్టి విజయం

"ఇది సమష్టి విజయం. మూడు విభాగాల్లోనూ అద్భుతంగా రాణించారు. రెండు ఇన్నింగ్స్​లోనూ బౌలర్లు అద్భుతంగా రాణించడం వల్ల ఈ విజయం సాధ్యమైంది. గతరెండు టెస్టు మ్యాచుల్లో మేము అంతగా ఆడలేకపోయాం. కానీ ఇక్కడ మంచి ఆరంభం లభించింది. ఈ విజయాన్ని ఇక్కడే మరిచిపోయి రెండో టెస్టులో మరింత ఉత్తమంగా రాణించేలా ప్రయత్నం చేస్తాం" అని బంగ్లా కెప్టెన్​ మొమినుల్​ హక్​ హర్షం వ్యక్తం చేశాడు.

రికార్డులు

ఈ విజయంతో బంగ్లాదేశ్​ కొన్ని రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.

  • కివీస్​ గడ్డపై బంగ్లాదేశ్​కు ఇదే తొలి టెస్టు విజయం. 16 ఓటముల తర్వాత ఈ గెలుపు దక్కింది.
  • అన్ని ఫార్మాట్లలోనూ కలిపి ఇదే మొట్టమొదటి గెలుపు. 2001 నుంచి ఇప్పటివరకు మూడు ఫార్మాట్​లలో కలిపి 32 మ్యాచులు అన్నింటిలోనూ ఓటమి చెందింది.
  • విదేశీ గడ్డపై టాప్​-5లో ఉన్న జట్టును ఓడించడం కూడా బంగ్లాకు ఇదే తొలిసారి.

ఇదీ చూడండి: ఒకే మ్యాచ్‌లో రెండు వివాదాస్పద క్యాచ్‌లు.. అభిమానులు గుస్సా!

Last Updated : Jan 5, 2022, 9:23 AM IST

ABOUT THE AUTHOR

...view details