న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు(IND vs NZ test)లో సెంచరీతో రాణించాడు టీమ్ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer Century). ఇది కెరీర్లో అతడి మొదటి టెస్టు అయినా.. ఏమాత్రం తడబడకుండా పరుగులు రాబట్టాడు. ఈ నేపథ్యంలో రెండో రోజు ఆట ముగిసిన అనంతరం మాట్లాడిన శ్రేయస్.. పలు విషయాలు వెల్లడించాడు. ఇప్పుడు తన గురువును డిన్నర్‌కు ఆహ్వానిస్తానంటూ వెల్లడించాడు.
"ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడం సంతోషాన్ని కలిగించింది. ఇప్పుడు మా గురువు ప్రవీణ్ ఆమ్రే(shreyas iyer about pravin amre) సర్‌ను ఇంటికి డిన్నర్‌కు ఆహ్వానిస్తా. నేను ఎప్పుడు ఆయన వద్దకు ట్రైనింగ్ కోసం వెళ్లినా.. 'నువ్వు నీ జీవితంలో చాలా సాధించావు. ఐపీఎల్ జట్టుకు కెప్టెన్‌గా చేశావు. చాలా పరుగులు సాధించావు. కానీ అదంతా పరిమిత ఓవర్ల క్రికెట్లో. నీ ప్రధాన లక్ష్యం ఏంటంటే టీమ్ఇండియా తరఫున టెస్టు మ్యాచ్ ఆడటం. అలా నువ్వు టెస్టు సెంచరీ సాధించినపుడే నేను నీతో డిన్నర్ చేస్తా' అనేవారు. ఈ మ్యాచ్‌లో నేను సెంచరీ చేశా. ఇక ప్రవీణ్ సర్‌ను డిన్నర్ కోసం ఆహ్వానిస్తా."