2018లో కేప్‌టౌన్ టెస్టులో జరిగిన సాండ్ పేపర్ గేట్ వివాదంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ స్పందించాడు. ఈ విషయం గురించి మరికొందరికి తెలుసంటూ ఆసీస్ క్రికెటర్ బాన్‌క్రాఫ్ట్ చేసిన వ్యాఖ్యలు తనకేమీ ఆశ్చర్యంగా అనిపించలేదని పేర్కొన్నాడు.
"సాండ్ పేపర్ గేట్ వివాదంలో.. మైదానంలో ఏమి జరిగిందో క్రికెట్ గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దీని గురించి తప్పుగా మాట్లాడటానికి ఏమి లేదు. బాల్ ట్యాంపరింగ్ విషయం కేవలం వార్నర్, స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లకు మాత్రమే తెలుసంటే నమ్మశక్యంగా లేదు. బాన్‌క్రాఫ్ట్ మాట్లాడిన మాటలు తమకు ఆశ్చర్యంగా అనిపించాయని చాలా పేపర్లు ఆర్టికల్స్ రాశాయి. కానీ నాకేమీ అలా అనిపించలేదు."
-మైకేల్ క్లార్క్, ఆసీస్ మాజీ కెప్టెన్.
గతంలో జరిగిన వివాదం గురించి బాన్‌క్రాఫ్ట్ ఇప్పుడు మాట్లాడడం తప్పు కాదని క్లార్క్ పేర్కొన్నాడు. కానీ, అతడు కొత్తగా చెప్పిన విషయమేమీ లేదని తెలిపాడు.