Rahul Dravid News: గతేడాది యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే వైదొలిగింది. ఆ తర్వాత రవిశాస్త్రి నుంచి టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రవిడ్‌కు ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ పెద్ద సవాలుగా మారింది! దీనికి ఇంకా ఎనిమిది నెలల కంటే తక్కువ సమయమే ఉంది. ఈ మెగా టోర్నీ కోసం జట్టు కూర్పునకు ఇప్పటినుంచే కసరత్తు మొదలు పెట్టింది భారత్. ఈ క్రమంలోనే ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టు కాంబినేషన్‌పై తనకు కెప్టెన్ రోహిత్ శర్మ, టీమ్ మేనేజ్మెంట్కు ఓ క్లారిటీ ఉందని అన్నాడు. ఇప్పటివరకు ఎలాంటి వ్యూహాలు లేవని స్పష్టం చేశాడు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను రోహిత్ సేన క్లీన్‌స్వీప్ చేసిన అనంతరం ద్రవిడ్ ఈ మేరకు వ్యాఖ్యానించాడు.
"నాతో పాటు రోహిత్, సెలెక్టర్లు, మేనేజ్‌మెంట్ మధ్య సరైన అవగాహన ఉందని భావిస్తున్నాను. ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయని అనుకోను. కానీ జట్టు కూర్పు (టీ20 ప్రపంచకప్ కోసం) గురించి చాలా క్లారిటీగా ఉన్నాం. దానిని బ్యాలెన్స్ చేస్తున్నాం. ఇది వ్యక్తిగత పనిభారం కూడా. అయితే ప్రతిభావంతులైన ఆటగాళ్లతో ఆస్ట్రేలియాకు వెళ్లాలని భావిస్తున్నాం. ఇందుకు టాలెంట్ ఉన్న ప్రతిఒక్కరికీ వారి నైపుణ్యాలను నిరూపించుకునే అవకాశమివ్వాలని అనుకుంటున్నాం. ప్రపంచకప్ సమయానికి వారు 15 నుంచి 20 మ్యాచ్‌లు ఆడే అవకాశముంటుంది. తద్వారా వారి ప్రతిభను నిరూపించుకోవచ్చు"
- టీమ్ఇండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్
కిషన్‌కు ద్రవిడ్ మద్దతు
Ishan Kishan Rahul Dravid: ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న యంగ్‌స్టార్ ఇషాన్ కిషన్‌తో పాటు యువ క్రికెటర్లకు మద్దతుగా నిలిచాడు ద్రవిడ్. "ఇషాన్ తన సామర్థ్యం, ప్రదర్శనతోనే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఎప్పుడూ ఆటగాళ్లు ఒకేలా ఉండలేరు. వారికి ఇన్ని మ్యాచ్‌లే అని పరిమిత విధించకూడదు. రుతురాజ్ గైక్వాడ్ అయినా.. అవేశ్ ఖాన్ అయినా.. వారిని ఒకే మ్యాచ్‌తో అంచనా వేయలేం. మంచి ప్రదర్శనతోనే వారు ఈ స్థాయికి చేరుకున్నారు" అని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు.