Ravi Shastri T20 Format: టీ-20 మ్యాచ్‌లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి. ద్వైపాక్షిక టీ-20 సిరీస్‌లు అవసరం లేదని, పొట్టి ఫార్మాట్ క్రికెట్‌ను కేవలం ప్రపంచ కప్‌కే పరిమితం చేయాలని అన్నాడు. ఐపీఎల్ వంటి ఫ్రాంఛైజీ క్రికెట్, వరల్డ్‌కప్‌లోనే టీ-20 మ్యాచ్‌లను ప్రేక్షకులు కోరుకుంటున్నారని, అదే అసలైన మజా ఇస్తుందని కామెంట్స్ చేశాడు. సౌతాఫ్రికాతో భారత్ 5 మ్యాచ్‌ల టీ-20 సిరీస్ ఆడనున్న నేపథ్యంలో శాస్త్రి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
''ఫుట్‌బాల్ మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. టీ-20 క్రికెట్లో వరల్డ్‌కప్ మాత్రమే ఆడాలి. ద్వైపాక్షిక టోర్నమెంట్లను ఎవరూ గుర్తుపెట్టుకోరు. టీమ్ఇండియా కోచ్‌గా ఉన్న గత ఆరేడేళ్లల్లో వరల్డ్‌కప్ మినహాయించి ఒక్క టీ-20 మ్యాచ్ కూడా నాకు గుర్తులేదు. జట్టు వరల్డ్‌కప్ గెలవాలి. అది అంతా గుర్తుపెట్టుకుంటారు. దురదృష్టవశాత్తు మేం గెలవలేదు. అందుకే నాకేమీ గుర్తులేదు.''
- రవి శాస్త్రి, టీమ్ఇండియా మాజీ కోచ్
ఐపీఎల్ భవిష్యత్తు గురించి వచ్చిన చర్చలో.. ప్రతి క్యాలెండర్ ఇయర్లో రెండు సార్లు ఐపీఎల్ నిర్వహించాలని అన్నాడు కామెంటేటర్, ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. త్వరలోనే ఇది సాకారమయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. చోప్రాతో ఏకీభవించిన శాస్త్రి.. అలా చేస్తేనే ఐపీఎల్‌కు భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయపడ్డాడు. రవిశాస్త్రి వరుసగా నాలుగేళ్లు టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా పనిచేశాడు. తన కోచింగ్‌లో భారత టెస్టు జట్టు నెం.1కు చేరింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు వెళ్లింది. విదేశాల్లో టెస్టు సిరీస్‌లు గెలిచింది.
ఐపీఎల్ 2022 సీజన్ మే 29న ముగిసింది. పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ కప్పు ఎగరేసుకుపోయింది. ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుచేసింది. 2022 అక్టోబర్ 16న టీ-20 ప్రపంచకప్ సంగ్రామం షురూ కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. మొత్తం 16 జట్లు 45 మ్యాచ్‌లు ఆడనున్నాయి. సౌతాఫ్రికాతో స్వదేశంలో టీ-20 సిరీస్ జూన్ 9న మొదలవనుంది.
ఇవీ చూడండి:'అబ్బాయినైతే బాగుండు.. ఆ 'నొప్పి' ఉండేదే కాదు'.. క్రీడాకారిణి భావోద్వేగం
ఆ టీ20 సిరీస్‌పై టీమ్ఇండియా కన్ను.. జూన్ 5న దిల్లీకి పయనం..