Cricket News: పంజాబ్‌లో 21 ఏళ్ల కుర్రాడు చరిత్ర సృష్టించాడు. క్రికెట్లో 578 పరుగుల స్కోర్ చేసి అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. అతడే పంజాబ్‌కు చెందిన 21 ఏళ్ల నిహాల్ వదేరా. జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో ఈ రికార్డు నమోదు చేశాడు. నాలుగు రోజుల పాటు సాగే ఈ మ్యాచ్‌లో నిహాల్ విజృంభణతో అతను ప్రాతినిధ్యం వహిస్తున్న లుథియానా జట్టు ఆరు వికెట్ల నష్టానికి 880 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. నిహాల్ చేసిన 578 పరుగుల్లో 42 ఫోర్లు, 37 సిక్సర్లు ఉండటం విశేషం. అంటే 480కిపైగా పరుగులను అతను బౌండరీలో రూపంలోనే సాధించాడు. లుథియానా నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బఠిండా.. స్టంప్స్ సమయానికి 117/4 స్కోరుతో ఉంది.
తాను ఇంత భారీ స్కోరు సాధిస్తానని అసలు ఊహించలేదని నిహాల్ తెలిపాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 200కుపైగా పరుగులు చేశానని, మహా అయితే ట్రిపుల్ సెంచరీ చేస్తా అని అనుకున్నట్లు చెప్పాడు. కానీ అనూహ్యంగా 578 పరుగులు చేయడం సంతోషంగా ఉందన్నాడు. తనకు విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్ అంటే అమితమైన అభిమానం అని, వారి స్ఫూర్తితోనే క్రికెట్లో రాణిస్తున్నట్లు వెల్లడించాడు. నిహాల్ కోచ్ కూడా అతని ప్రదర్శనపై ఆనందం వ్యక్తం చేశాడు. ఇదే ఫాం కొనసాగిస్తే భవిష్యత్‌లో మరిన్ని రికార్డులను నిహాల్ కొల్లగొడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.