కేన్ విలియమ్సన్(Kane Williamson).. ప్రస్తుతం ఉన్న పాపులర్ క్రికెటర్లలో ఒకడు. ఫార్మాట్ ఏదైనా సరే తనదైన స్టైల్లో ఆడుతూ, కూల్‌గా ప్రత్యర్థిని ఓడిస్తూ పలు రికార్డులను సృష్టిస్తున్నాడు. అతడి ఖాతాలో ఎన్ని రికార్డులున్నా.. ఇటీవల జరిగిన ప్రపంచటెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో కివీస్ జట్టుకు అతడందించిన విజయాన్ని క్రికెట్ ప్రేమికులు మర్చిపోలేరు. ఎందుకంటే జెంటిల్మెన్ ఆటైన క్రికెట్లో అతనో నిఖార్సైన జెంటిల్మెన్. ఇవాళ(ఆగస్టు 8) అతడి పుట్టినరోజు సందర్భంగా కొన్ని విశేషాలు మీకోసం..
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC Final) ఫైనల్.. టేలర్ ఫోర్‌తో కివీస్ విజయాన్ని అందుకోగానే స్టాండ్స్‌లోని ఆ దేశ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. డ్రెస్సింగ్ గదిలోని ఆ జట్టు ఆటగాళ్లు సంతోషంతో గంతులేశారు. కానీ మరో ఎండ్‌లో ఉన్న విలియమ్సన్.. గాల్లోకి ఎగిరి విజయనాదం చేయలేదు.. ప్రత్యర్థి వైపు చూస్తూ గెలుపు సంబరాలు చేసుకోలేదు.. "మేం గెలిచాం" అన్నట్లు ఓ నవ్వు విసిరేశాడంతే. ఎందుకంటే అతనో నిఖార్సైన జెంటిల్మన్. దాదాపు రెండేళ్ల పాటు సాగిన కఠిన ప్రయాణం అనంతరం అందిన తుది విజయమది.. ప్రపంచ ఛాంపియన్లుగా నిలిపిన గెలుపది.. అయినా అదో మామూలు విజయమే అన్నట్లు అతను ప్రదర్శించిన పరిణతి గొప్పది. సాధారణ జట్టును ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపిన ఘనత అతనిది. సారథిగా అతని ప్రభావం జట్టు తలరాతనే మార్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. వన్డేల్లో, టీ20ల్లో సాధ్యం కాని ఘనతను ఆ జట్టు ఇప్పడు టెస్టుల్లో అందుకుంది.
అతనొచ్చాక
అండర్‌డాగ్స్‌గా.. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రపంచకప్‌ల్లో బరిలో దిగడం.. పేలవ ప్రదర్శనతో ఉసూరుమనిపించడం.. ఇదీ ఆ జట్టు గత పరిస్థితి. ఈ ఏడాది ముందు వరకూ దశాబ్దాల ఆ దేశ క్రికెట్ చరిత్రలో ఒక్కసారి కూడా టెస్టుల్లో అగ్రస్థానాన్ని అందుకోలేదు. ప్రపంచ ఛాంపియన్లుగానూ నిలవలేదు. గతంలోనూ కివీస్ జట్టులో ఆల్‌రౌండర్లకు కొదవేమీ లేదు. లోయర్ ఆర్డర్లోనూ బ్యాటింగ్ చేయగల బౌలర్లు జట్టులో ఉండేవాళ్లు. బౌలింగ్, బ్యాటింగ్‌లోనూ ఆ జట్టు పటిష్ఠంగా ఉండేది. కానీ ఐసీసీ ప్రధాన టోర్నీల్లో మాత్రం విఫలమయ్యేది. కానీ గత కొన్నేళ్లలో దాని ఆటతీరు అనూహ్యంగా మారింది. జట్టుకు దూకుడు నేర్పిన మాజీ కెప్టెన్ మెక్‌కలమ్.. 2015 వన్డే ప్రపంచకప్‌లో కివీస్‌ను ఫైనల్ చేర్చగలిగాడు. ఇక అతని తర్వాత జట్టు పగ్గాలు అందుకున్న విలియమ్సన్.. దూకుడు నేర్చిన జట్టుకు ప్రశాంతతను అలవాటు చేసి అద్భుత ఫలితాలు సాధించడం మొదలెట్టాడు. అతనొచ్చాక.. పరిస్థితులు మారాయి. జట్టు ప్రదర్శన మారింది. ప్రస్తుత జట్టులో బ్యాటింగ్‌లో విలియమ్సన్, సీనియర్ రాస్ టేలర్.. బౌలింగ్‌లో బౌల్ట్, సౌథీ ద్వయం మినహా చెప్పుకోదగ్గ అగ్రశ్రేణి ఆటగాళ్లు లేరు. అయినప్పటికీ సహచరులపై నమ్మకం పెట్టిన అతను.. వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపి మంచి ప్రదర్శన రాబట్టగలిగాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో జట్టును విజేతగా నిలిపినంత పని చేశాడు. ఆ బాధ నుంచి జట్టు త్వరగానే కోలుకునేలా చూసి.. రెండేళ్ల తర్వాత అదే ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో జట్టును ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించేలా చేశాడు. బ్యాట్స్‌మన్‌గానూ జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. డబ్ల్యూటీసీలో ఆ జట్టు తరపున అత్యధిక పరుగులు (10 మ్యాచ్‌ల్లో 61.20 సగటుతో 918) చేసిన ఆటగాడతనే.