Newzealand Vs Srilanka World Cup 2023 :గత రెండు ప్రపంచకప్‌ల్లో రన్నరప్‌గా నిలిచి.. ఈ కప్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శించింది న్యూజిలాండ్ జట్టు. కానీ అక్కడి నుంచి వరుసగా నాలుగు ఓటములతో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. దీంతో ఇప్పుడు సెమీస్‌లోకి వెళ్లాలంటే.. తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో గురువారం శ్రీలంకను ఢీకొట్టనుంది. కేవలం గెలుపు కాదు ఈ మ్యాచ్‌లో ఆ జట్టుకు ఘనవిజయం అవసరం.
అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ప్రత్యర్థి కంటే ముందు కివీస్‌ను వరుణుడు భయపెడుతున్నాడు. మరొకొద్ది గంటల్లో జరగనున్న మ్యాచ్‌కు వర్షం ముప్పుందని వాతావరణ శాఖ సమాచారం. దీంతో ఇప్పుడు లంకపై ఓడినా లేకుంటే వాన కారణంగా మ్యాచ్ రద్దయినా కివీస్‌కు కష్టమే.
మరోవైపు ప్రపంచకప్‌లో భారత్‌కు ప్రత్యర్థి ఎవరు అన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన భారత్.. 8 పాయింట్లతో సమానంగా ఉన్న పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ల నుంచి ఓ జట్టుతో సెమీస్‌లో తలపడనుంది. ఆ తర్వాత మరో సెమీస్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఢీకొట్టనున్నాయి.
ఇక గురువారం శ్రీలంకపై విజయం సాధిస్తే న్యూజిలాండ్ (0.398) సెమీస్‌కు చేరడం దాదాపు ఖాయం. ఎందుకంటే ఆ జట్టు రన్‌రేట్ పాకిస్థాన్ (0.036), అఫ్గాన్ (-0.338) కంటే మెరుగ్గా ఉంది. ఒకవేళ శ్రీలంకతో జరగనున్న మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే.. కివీస్‌కు అవకాశం ఉంటుంది. కానీ పాక్, అఫ్గాన్ తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది.