ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య పోటీ సమానంగా ఉంటుందని కివీస్ కోచ్ మైక్ హెసన్ అన్నాడు. ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించాడు. ఐదుగురు బౌలర్లను ఆడిస్తే అశ్విన్, జడేజా ఇద్దరికీ చోటివ్వాలని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా తరహాలో రిషభ్ పంత్ ఫైనల్లో కీలకమవుతాడని పేర్కొన్నాడు. కాగా నాలుగు రోజుల అంతరంతో మూడు టెస్టులను వరుసగా ఆడటం తమ ఆటగాళ్లకు భారమేనని తెలిపాడు. పని భారాన్ని పర్యవేక్షించాల్సి ఉంటుందని వెల్లడించాడు.
"నాలుగు రోజుల అంతరంతో మూడు టెస్టులు ఆడటం సమస్యే. న్యూజిలాండ్ బౌలింగ్ దాడిని పర్యవేక్షించుకోవాలి. అందుకే ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు ట్రెంట్ బౌల్ట్‌ను తీసుకుంటున్నాం. ఈ నిర్ణయంతో మరొకరికి విశ్రాంతి దొరుకుతుంది. ఎందుకంటే రెండో టెస్టులో 45-50 ఓవర్లు వేస్తే పనిభారాన్ని పర్యవేక్షించాల్సి ఉంటుంది. ద్విశతక వీరుడు డేవాన్ కాన్వే అద్భుతమైన ఆటగాడు. టెస్టు క్రికెట్‌కు ఎప్పుడు అర్హత సాధిస్తాడా అని ఎదురుచూశాం. టామ్ బ్లండెల్‌కు చోటివ్వకపోవడం కఠిన నిర్ణయమే. కానీ కాన్వే కోసం తప్పదు."
-మైక్ హెసన్, కివీస్ కోచ్.
టీమ్‌ఇండియా జట్టు కూర్పు, ఆటగాళ్ల ఎంపిక గురించీ హెసన్ సలహాలు ఇవ్వడం గమనార్హం. "బహుశా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌తో ఓపెనింగ్ చేయించాలని కోహ్లీసేన భావిస్తుండొచ్చు. మయాంక్‌ను పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుంది. న్యూజిలాండ్‌లో అతడు కివీస్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాడు. మిగతావాళ్ల కన్నా ఎక్కువ పరుగులు చేశాడు. కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు" అని హెసన్ తెలిపాడు.