అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపాల్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ సందీప్ లమిచ్చానే.. స్వయంగా తానే పోలీసుల ముందు లొంగిపోతానని ప్రకటించాడు. అక్టోబర్ 6న తన స్వదేశానికి వచ్చి అధికారుల ముందు హాజరవుతానని చెప్పాడు. విచారణకు సహకరిస్తానని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని సోషల్‌మీడియాలో తెలిపాడు. ఇంటర్‌పోల్ అతడి ఆచూకీ కోసం డిఫ్యూజన్ నోటీసు జారీ చేసిన అనంతరం అతడు ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు.
ఇదీ జరిగింది: తనను సందీప్.. ఆగస్టు 21 కాఠ్ మాండూ, భక్తపూర్‌లోని పలు ప్రాంతాల్లో తిప్పి.. అదే రోజు రాత్రి కాఠ్ మాండు సినమంగల్‌లోని ఓ హోటల్‌కు తీసుకొచ్చి అక్కడే అత్యాచారం చేసినట్లు నేపాల్‌కు చెందిన ఓ 17ఏళ్ల మైనర్ బాలిక ఆరోపించింది. అతడిపై అక్కడి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు.. అతడి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. నేపాల్ కోర్టు కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ విషయం తెలియడంతో నేపాల్ క్రికెట్ బోర్డు అతడిపై వేటు వేసింది. జట్టు నుంచి తప్పించింది. కాగా, అప్పటికే అతడు కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) ఆడేందుకు జమైకా వెళ్లాడు. అయితే టోర్నీ నిర్వాహకులకు సమాచారం అందడంతో అతన్ని జట్టు నుంచి తొలగించారు. అయితే అప్పటినుంచి స్వదేశానికి రాకుండా అక్కడే ఉండిపోయాడు. దీంతో నేపాల్ పోలీసులు సందీప్‌ను అరెస్ట్ చేసేందుకు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించారు. దీంతో ఇంటర్‌పోల్ డిప్యూజన్ నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే స్పందించిన అతడు.. తాను ఏ తప్పు చేయలేదని.. త్వరలోనే దేశానికి తిరిగి వచ్చి తనపై వచ్చిన ఆరోపణలు తప్పుడువని నిరూపించుకుంటానని' సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు తాజాగా మళ్లీ సామాజిక మాధ్యమాల వేదికగా అక్టోబర్ 6న స్వదేశానికి వచ్చి పోలీసుల ముందు హాజరవుతానని పేర్కొన్నాడు.