Nehra on Indian Pacers: దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్‌ఇండియా మూడో పేసర్‌ను ఎంపిక చేయాల్సి వస్తే.. హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ముందుంటాడని మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. బుమ్రా, షమీ కచ్చితంగా తుదిజట్టులో ఉంటారని, దీంతో మూడో పేసర్ కోసం ఆలోచిస్తే.. సిరాజ్ అందుబాటులో ఉన్నాడన్నాడు. కాగా, సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికైనా ఇటీవల న్యూజిలాండ్‌తో రెండో టెస్టు సందర్భంగా గాయపడ్డాడు. దీంతో ఆ మ్యాచ్‌లో అవకాశం దక్కిన సిరాజ్ ఆకట్టుకున్నాడని నెహ్రా అన్నాడు. అయితే, సఫారీ జట్టుతో ఆడేటప్పుడు అతడిని ఎంపిక చేయాలా? వద్దా? అనేది జట్టు యాజమాన్యం చేతుల్లో ఉంటుందన్నాడు.
"టీమ్ఇండియాకు సానుకూలాంశం ఏంటంటే.. సరిపడా బౌలింగ్ దళం ఉంది. పేస్ విభాగం పటిష్ఠంగా తయారైంది. అలాగే ఉమేశ్ యాదవ్ లాంటి అనుభజ్ఞుడు ఉన్నాడు. జట్టుకు ఇలాంటి నాణ్యమైన ఆటగాళ్లను అందించినందుకు ఐపీఎల్‌కు ధన్యవాదాలు చెప్పాలి. ఆటగాళ్లంతా ఇప్పుడెంతో ఫిట్‌నెస్‌తో ఉన్నారు. బ్యాకప్ కూడా బలంగా ఉంది. ఇంతకుముందు జట్టులో ఇద్దరు లేదా ముగ్గురు పేసర్లు మాత్రమే ఉండేవాళ్లు. ఒకవేళ ఎవరైనా గాయాలబారిన పడితే ఇక జట్టు డీలా పడిపోయేది. అయితే, ఇప్పుడా పరిస్థితి లేదు. ముఖ్యంగా టెస్టుల్లో బలమైన బ్యాకప్ కలిగి ఉండటం చాలా ముఖ్యమైన విషయం."