న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో (Ind vs NZ T20) భారత్ ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నానని టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid Coach News) చెప్పాడు. అయితే ఈ విజయం పట్ల రియాలటీలోనే ఉండాలని అన్నాడు.
ఆదివారం జరిగిన చివరిదైన మూడో టీ20లో కివీస్‌పై 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది టీమ్ఇండియా. కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ శతకానికి తోడు, అక్షర్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టి విజయాన్ని అందించారు.
"ఇదో మంచి విజయం. సిరీస్ మొత్తం ప్రతి ఒక్కరూ బాగా రాణించారు. మంచి ఆరంభం కూడా. అయితే మేము రియాలిటీకి దూరంగా ఉండాలనుకోవట్లేదు. కాళ్లు నేల మీద ఉంచాలనుకుంటున్నాం. న్యూజిలాండ్.. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆడిన మూడు రోజులకే ఆరు రోజుల్లో మూడు మ్యాచ్‌లు ఆడటం అంటే అంత సులువైన విషయం కాదు. మనం బాగానే ఆడినా.. ఈ సిరీస్ నుంచి నేర్చుకొని ముందుకు వెళ్లాలి. వచ్చే 10 నెలల పాటు సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. ఆ సమయంలో మనకూ ఎత్తుపల్లాలు ఎదురవుతాయి. కుర్రాళ్లు రాణించడం మంచి విషయం."
- రాహుల్ ద్రవిడ్, టీమ్ఇండియా హెడ్ కోచ్
'ద్రవిడ్ అలాంటి వ్యాఖ్యలు చేయడు'
అయితే సిరీస్ విజయానికి ముందే ద్రవిడ్‌పై (Rahul Dravid News) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir News). మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, ద్రవిడ్‌కు మధ్య ఉన్న తేడా ఏంటో వివరించాడు.
కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli News), రవిశాస్త్రి నాయకత్వంలో టెస్టుల్లో ఏడో స్థానం నుంచి అగ్రస్థానానికి చేరుకుంది టీమ్ఇండియా. అలా వరుసగా 42 నెలల పాటు కొనసాగింది. స్వదేశంలో ఆధిపత్యం ప్రదర్శించడం సహా ఆస్ట్రేలియాలో బ్యాక్ టు బ్యాక్ సిరీస్‌లు గెలిచింది. ఈ ఏడాది ఇంగ్లాండ్‌లోనూ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు గెలిచింది. ఫైనల్ టెస్టు వచ్చే ఏడాది వేసవిలో బర్మింగ్‌హామ్‌లో జరగనుంది.
అయితే 2018 ఇంగ్లాండ్ పర్యటనలో.. కోహ్లీ నేతృత్వంలోని జట్టే ఇప్పటి వరకు అత్యుత్తమ టెస్టు జట్టని ప్రకటించాడు శాస్త్రి. టెస్టుల్లో టీమ్ఇండియా ఎదిగిన తీరుకు (Gautam Gambhir on Ravi Shastri) శాస్త్రి బృందాన్ని ప్రశంసించిన గంభీర్.. అలాంటి బోల్డ్ ప్రకటనలు చేయకుండా ఉండాల్సిందన్నాడు. ప్రస్తుత కోచ్ ద్రవిడ్ (Gautam Gambhir Dravid) అలాంటి పని ఎన్నటికీ చేయడని భావిస్తున్నట్లు చెప్పాడు.