Chris Gayle Narendra Modi: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ క్రిస్‌గేల్.. భారత దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాడు. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి తనకు వ్యక్తిగత సందేశం వచ్చిందని ట్వీట్ చేశాడు.
"73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నిద్రలేస్తూనే మోదీ నుంచి నాకు పర్సనల్ మెసేజ్ రావడం చూశాను. ఆయనతో సహా దేశప్రజలందరితో నాకు మంచి అనుబంధం ఉంది. యూనివర్స్ బాస్ నుంచి ప్రతిఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను."
-క్రిస్‌గేల్, వెస్టిండీస్ క్రికెటర్.
ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన గేల్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో మన దేశంలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు.
కెరీర్లో 79 టీ20లు, 103 టెస్టులు, 301 వన్డేలు ఆడాడు గేల్. 2012, 2016 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ గెలిచిన వెస్టిండీస్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
జాంటీ రోడ్స్‌కు కూడా
దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్‌కు కూడా ప్రధాని నరేంద్ర మోదీ సందేశం పంపారు. అందులో భారతదేశ గణతంత్ర దినోత్సవ ఔచిత్యాన్ని వివరించారు. ప్రధాని పంపిన లేఖను జాంటీ రోడ్స్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
"విదేశీయుల పాలన నుంచి స్వాతంత్య్రం పొంది భారతీయులు 75 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న తరుణంలో.. ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఎంతో ప్రత్యేకం. ఈ నేపథ్యంలో భారత ప్రజలతో సన్నిహిత సంబంధాలున్న మరికొంత మంది స్నేహితులకు కూడా నేను లేఖ రాస్తున్నాను. భవిష్యత్తులోనూ ఇలాగే సత్సంబంధాలు కొనసాగించాలని ఆశిస్తున్నాను. మీ కుమార్తెకి 'ఇండియా జెన్నీ రోడ్స్' అని పేరు పెట్టుకున్నారంటే.. మీకు భారత్‌పై ఉన్న అభిమానమెంతో అర్థమవుతోంది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగేందుకు మీరే ప్రత్యేక రాయబారిగా ఉంటారని ఆశిస్తున్నాను" అని మోదీ ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ.. జాంటీ రోడ్స్ ఓ ట్వీట్ చేశారు. "మీ అభిమానానికి ధన్యవాదాలు నరేంద్ర మోదీ. భారత పర్యటనలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. వ్యక్తిగా ఎంతో ఎదిగాను. భారత ప్రజల హక్కులను కాపాడే రాజ్యాంగం ప్రాముఖ్యతను గౌరవిస్తూ.. మా కుటుంబ సభ్యులమంతా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. జైహింద్" అని జాంటీ రోడ్స్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇదీ చూడండి:
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
కోహ్లీ, దాదా గొడవ.. అలా చేయాలని కపిల్‌దేవ్ సూచన