తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసియా కప్‌ 2023.. జైషాతో PCB ఛైర్మన్​ చర్చించనున్నారా? - ఆసియా కప్​ 2023 న్యూస్​

దాయాదుల పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాది ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ ఉండటంతో భారత్- పాక్‌ మ్యాచ్‌లను చూడొచ్చని ఆశ పడ్డారు. కానీ గతంలో బీసీసీఐ, పీసీబీ ఉన్నత స్థానాల్లో ఉన్నవారు పరస్పరం వ్యాఖ్యలు చేసుకోవడం వల్ల ఆసియా కప్‌ నిర్వహణ ఎక్కడనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో తాజాగా ఇదే అంశంపై జైషాతో మాట్లాడాలని నజామ్‌ భావిస్తున్నట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి

pcb chairman to meet jay shah
pcb chairman to meet jay shah

By

Published : Jan 12, 2023, 9:02 AM IST

ఆసియా కప్‌ నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పాకిస్థాన్‌ వేదికగా టోర్నీలో పాల్గొనబోమని బీసీసీఐ కార్యదర్శి జై షా గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అప్పుడు పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్న రమీజ్‌ రజా కూడా అంతే స్థాయిలో స్పందిస్తూ.. " టీమ్‌ఇండియా ఇక్కడ ఆడకపోతే.. భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో తమ జట్టు పాల్గొనదు" అని వ్యాఖ్యానించాడు. దీంతో ఇరు దేశాల క్రికెట్ అభిమానుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఇప్పుడు పీసీబీ అధ్యక్షుడిగా నజామ్‌ సేథి వచ్చారు. ఈ క్రమంలో తాజాగా ఇదే అంశంపై జైషాతో మాట్లాడాలని నజామ్‌ భావిస్తున్నట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి. ఆసియా క్రికెట్ అసోసియేషన్ (ఏసీసీ) ఛైర్మన్‌గానూ జైషా ఉన్న సంగతి తెలిసిందే.

గురువారం జరిగే అంతర్జాతీయ లీగ్‌ టీ20 ప్రారంభోత్సవానికి జైషా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో జైషాతో నజామ్‌ సేథి భేటీ అవుతారని పీసీబీ వర్గాలు పేర్కొన్నాయి. "ఆసియా కప్ నిర్వహణకు సంబంధించి ఆసియా సభ్య దేశాలతో సత్సంబంధాలను కొనసాగించేందుకు నజామ్‌ సేథి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా జైషాతో చర్చించాలని నజామ్ భావిస్తున్నారు. ఆసియా కప్‌ నిర్వహణకు పాక్‌ అన్ని విధాలా సురక్షితమనే భరోసాను సభ్యదేశాలకు ఇవ్వడం కోసమే నజామ్‌ సేథి ప్రయత్నాలు"అని పాక్‌ క్రికెట్ బోర్డు వర్గాలు తెలిపాయి. ఏసీసీ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. వన్డే ఫార్మాట్‌లో సెప్టెంబర్‌లో ఆసియా కప్ జరగనుంది. అయితే వేదిక మాత్రం ఎక్కడనేది వెల్లడించకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details