ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌తోపాటు భారత జట్టుకు అనేక ట్రోఫీలు అందించిన ఘనత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సొంతం. అతడి సారథ్యంలో టీమ్‌ఇండియా గొప్పగా రాణించి ఎన్నో గొప్ప విజయాలను సొంతం చేసుకుంది. అయితే, క్రికెట్‌లో పలు ఘనతలు సాధించినప్పటికీ.. చదువులో మాత్రం అతడో సాధారణ విద్యార్థి. ఈ విషయాన్ని స్వయంగా ధోనీనే వెల్లడించాడు. ఓ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతూ నాటి విషయాలను గుర్తుచేసుకున్నాడు. తాను పదో తరగతి కూడా పాస్ కానని తన తండ్రి భావించారని తెలిపాడు.
ధోనీ టెన్త్ క్లాస్ పాస్ అవ్వడని వాళ్ల నాన్న అనుకున్నారట! - dhoni tenth class
ఓ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ధోనీ మాట్లాడుతూ.. అప్పట్లో తాను ఓ సాధారణ విద్యార్థినని తెలిపాడు. పదో తరగతిలో తాను పాస్ కానేమోనని తన తండ్రి భావించినట్లు నాటి విషయాలను గుర్తుచేసుకున్నాడు.
మీరు ఎలాంటి విద్యార్థి?, మీ ఫేవరేట్ సబ్జెక్ట్ ఏంటి? అని ఓ విద్యార్థిని ప్రశ్నించగా.. మిస్టర్ కూల్ నవ్వుతూనే సమాధానాలు చెప్పాడు. 'నేనో సాధారణ విద్యార్థిని. ఏదో తరగతి నుంచి క్రికెట్ ఆడటం ప్రారంభించాను. ప్రాక్టీస్ చేస్తూ క్లాసులకు తక్కువగా హాజరయ్యేవాడిని. అందుకే నా హాజరు శాతం పడిపోతూ వచ్చింది. పదో తరగతిలో దాదాపు 66 శాతం, 12లో 56 లేదా 57శాతం మార్కులు వచ్చాయి' అని పేర్కొన్నాడు.
'ఎప్పుడూ క్రికెట్ ఆడుతుండటంతో నా హాజరు శాతం తక్కువగా ఉండేది. అది కొంచెం కష్టంగా అనిపించేది. 10వ తరగతిలో కొన్ని అధ్యాయాల గురించి ఏమాత్రం తెలియదు. వాటిల్లో నుంచి ప్రశ్నలు వస్తే ఏం రాయాలో తెలిసేది కాదు. నేను టెన్త్ బోర్డ్ పరీక్షల్లో పాస్ కానని మా నాన్న భావించారు. ఆ పరీక్షలు తిరిగి రాయాలేమో అనుకున్నారు. కానీ నేను పాసయ్యాను. అప్పుడు ఎంతో సంతోషంగా అనిపించింది' అంటూ ధోనీ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.