Mushfiqur Rahim Wicket :బంగ్లాదేశ్ సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్, విచిత్రమైన రీతిలో ఔటయ్యాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భాగంగా తొలి రోజు బంగ్లాదేశ్ బ్యాటింగ్‌కు దిగింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో కివీస్ పేసర్ కైల్ జెమిసన్ 41వ ఓవర్ బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్ మూడో బంతిని క్రీజులో ఉన్న ముష్ఫికర్, డిఫెన్స్ ఆడాడు.
అయితే బ్యాట్‌ను తాకిన బంతి, స్టంప్స్ మీదకు వెళ్తుందేమోనని ముష్ఫికర్ తన చేయి అడ్డుపెట్టి బంతిని ఆపాడు. దీంతో కివీస్ ప్లేయర్లంతా ముష్ఫికర్‌ను ఔట్ ఇవ్వాల్సిందిగా అప్పీల్ చేశారు. ఫీల్డ్ అంపైర్లు రాడ్ టకర్, పాల్ రేఫిల్ థర్డ్ ఎంపైర్‌కు రిఫర్ చేశారు. రిప్లై పరిశీలించిన థర్డ్ అంపైర్, ముష్ఫికర్‌ను ఔట్ (OBS)గా ప్రకటించాడు. అయితే ఎమ్‌సీసీ రూల్స్ 37.1 నిబంధన ప్రకారం క్రీజులో ఉన్న బ్యాటర్ ఉద్దేశపూర్వకంగా బంతిని బ్యాట్‌తో కాకుండా, చేయి, కాలు అడ్డుపెట్టి ఆపితే ఆ ప్లేయర్‌ను ఔట్‌గా ప్రకటిస్తారు.
దీంతో ముష్ఫికర్ క్రీజును వదిలి వెళ్లక తప్పలేదు. అయితే ఇలా బంతిని చేయితో ఆపి ఔట్‌గా వెనుదిరిగిన తొలి బంగ్లా బ్యాటర్‌గా నిలిచాడు ముష్ఫికర్. ఇంతకు ముందు అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్థాన్ ప్లేయర్ ఇంజామమ్ ఉల్ హక్, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఇలా ఔటయ్యారు.