Mumbai Indians Team 2022: ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు ముంబయి ఇండియన్స్ అనడంలో సందేహమే లేదు. ఈ జట్టు పేరు వినగానే మనకు కెప్టెన్ రోహిత్ శర్మ, విండీస్ విధ్వంసకర ఆటగాడు కీరన్ పొలార్డ్, భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యువఆటగాడు సూర్యకుమార్ యాదవ్ గుర్తొస్తారు. అయితే గతేడాది లీగ్ దశకే పరిమితమైంది ముంబయి. మరి ఈ సారి తనదైన ఆట ప్రదర్శిస్తుందో లేదో చూడాలి.
ఐపీఎల్లో జట్లు ఎన్ని ఉన్నా.. కొత్త జట్లు ఎన్ని వచ్చినా చాలాసార్లు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంటోంది. 2018 నుంచి పరిశీలిస్తే ఇది నిజమేనేమో అనేలా ఉన్నాయి గణాంకాలు. గత నాలుగు సీజన్లలో రెండేసి సార్లు ముంబయి (2019,2020), చెన్నై (2018,2021) టైటిల్స్ నెగ్గాయి. ఐపీఎల్ 2022 సీజన్‌కు వచ్చేసరికి ముంబయి జట్టులో మార్పులు చోటు చేసుకున్నా.. కీలక ఆటగాళ్లు ఉండటం, ఐపీఎల్ పోటీలు జరిగేది ముంబయి, పుణెలోనే కావడం కలిసొచ్చే అంశమే.
జట్టులో కీలక ప్లేయర్లు వీరే..
Mumbai Indians Key Players: ముంబయి ఇండియన్స్ అనగానే రోహిత్ శర్మ గుర్తుకొస్తాడు. కీరన్ పొలార్డ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా ఇతర కీలక ఆటగాళ్లు. మెగా వేలంలో ఇషాన్‌ను భారీ ధరకు దక్కించుకుంది జట్టు యాజమాన్యం. అలానే పేసర్లు జోఫ్రా ఆర్చర్, టైమల్ మిల్స్, జయ్‌దేవ్ ఉనద్కత్ ఉన్నారు. బ్యాటింగ్‌పరంగా చూసుకుంటే.. రోహిత్, ఇషాన్, సూర్యకుమార్, టిమ్ డేవిడ్, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలెన్ వేగంగా పరుగులు చేయగలరు. అయితే వీరిలో తొలి ముగ్గురు తప్పితే మిగతావారిపై పెద్దగా నమ్మకం ఉండకపోవచ్చు. జట్టులోని 25 మందిలో సగం మంది పెద్దగా తెలియని ఆటగాళ్లే. అయితే రంజీ సహా ఇతర దేశవాళీ టోర్నీల్లో రాణించడం వల్ల ముంబయి వారిని కొనుగోలు చేసింది.
ఓపెనర్లు సరే.. మరి ఆల్ రౌండర్లు?
Mumbai Indians Openers: ముంబయికి ఓపెనింగ్ సమస్య లేదు. రోహిత్ శర్మతో ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. అయితే బ్యాకప్ ఓపెనర్ ఎవరనేది జట్టు యాజమాన్యం నిర్ణయించాల్సి ఉంటుంది. గత సీజన్‌లో ఆల్‌రౌండర్లు రాణించకపోవడం కారణంగా లీగ్ దశకే ముంబయి పరిమితం కావాల్సి వచ్చింది. పాండ్య సోదరులు, కీరన్ పొలార్డ్ విఫలం కావడం వల్ల ముంబయికి దెబ్బ పడింది. అయితే ఈసారి పాండ్య బ్రదర్స్ లేరు. కీరన్ పొలార్డ్ కూడానూ పెద్దగా రాణించిందేమీ లేదు. అయితే ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా పొలార్డ్‌కు ఉంది. చివర్లో జోఫ్రా ఆర్చర్ కూడా విలువైన పరుగులు చేయగలడు. అలానే ఫాబియన్ అలెన్ హార్డ్ హిట్టరే. ఇక ఆసీస్ ఆటగాడు డానియల్ సామ్స్ ఫాస్ట్ మీడియంతోపాటు బ్యాటింగ్ చేస్తాడు. అయితే విదేశీ ఆటగాళ్లు తుది జట్టులో నలుగురు మాత్రమే ఉండాలనే నిబంధన ఉంది.