Mumbai Indians Rohit Sharma :సాధారణంగా క్రికెట్ టీ20 ఫార్మాట్లో దూకుడైన ఆట కావాలి. ఆ విషయంలో రోహిత్ శర్మ సూపర్ అని చెప్పొచ్చు. బౌలర్లపై కనికరం లేకుండా రోహిత్ విరుచుకుపడుతుంటాడు. దీంతో హిట్ మ్యాన్ అనే బిరుదు కూడా కొట్టేశాడు. ఇప్పటి వరకు క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ రికార్డును ఇప్పట్లో ఎవరూ దాటలేరు కూడా.
సెంచరీకి ఒక్క పరుగే ఉన్నా
రోహిత్ ఎప్పుడూ తన పర్సనల్ రికార్డులను లెక్క చేయడు. సెంచరీ సాధించేందుకు ఒక్క పరుగే ఉన్నా గాల్లో లేపి మరీ షాట్స్ కొడుతుంటాడు. ఎన్నో సెంచరీలు, హాఫ్ సెంచరీలు మిస్ అయినా జట్టుకు వేగంగా పరుగులు అందిస్తుంటాడు. తన తర్వాత క్రీజులోకి వచ్చే బ్యాటర్లకు ఒత్తిడి తగ్గాలని చూస్తుంటాడు. ఇలా తన కెప్టెన్సీతో ఇప్పటి వరకు ఐదు సార్లు ముంబయి ఇండియన్స్‌కు కప్పు అందించాడు. ఐపీఎల్లో అత్యధిక బ్రాండ్ ఉన్న జట్టుగా ముంబయిని నిలిపాడు.
టీమ్ఇండియా కెప్టెన్ ఒక ఐపీఎల్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడంటే అది ఆ టీమ్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతుందని పక్కాగా చెప్పొచ్చు. మూడన్నరేళ్ల క్రితం రిటైర్మెంట్ ప్రకటించినా ఇంకా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ కొనసాగుతున్నాడు. అతడే కాదు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన చాలామంది ప్లేయర్లు ఐపీఎల్ ఆడారు, ఆడుతున్నారు.
మరో రెండు సీజన్లు ఆడిస్తే!
అలాంటిది ఇంకా అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడుతున్న రోహిత్‌ను ముంబయి కెప్టెన్సీ నుంచి తప్పించడం క్రికెట్ అభిమానులకు తీవ్రంగా కోపం తెప్పించింది. మరో రెండు సీజన్లు రోహిత్‌ను కెప్టెన్‌గా ఆడిస్తే బాగుండేదని చాలా మంది భావన. ఇంతలో జట్టులోని సీనియర్లు బుమ్రా, సూర్యకుమార్‌ను వారసులుగా తీర్చిదిద్దే అవకాశం కూడా ముంబయి జట్టుకు ఉంది. ఇవేం పరిశీలించకుండా హార్దిక్ పాండ్యను గుజరాత్ జట్టు నుంచి తీసుకువచ్చేసి ముంబయి జట్టులో చేర్చడం సరైంది కాదనే మెజార్టీ అభిప్రాయం. ఇప్పటిదాకా జట్టులో ఆటగాళ్లకు అండగా ఉండి, ముంబయి ఇండియన్స్‌లో కుటుంబ వాతావరణాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని ఇలా తప్పించడం జట్టు సభ్యులకు కూడా నచ్చలేదనే వార్తలు కూడా వస్తున్నాయి.
సూర్య తప్ప ఎవరూ!
అయితే పాండ్యకు కెప్టెన్సీ బాధ్యతలపై జట్టులోని సభ్యులెవరూ పెద్దగా స్పందించలేదు. సూర్యకుమార్ యాదవ్ మాత్రమే రోహిత్‌ను తప్పించిన తర్వాత హార్ట్ బ్రేక్ అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. కానీ ఆ ట్వీట్ ఏ సందర్భాన్ని అనేది వెల్లడించకుండా పోస్టు చేయడంతో అభిమానులు పలు రకాలుగా భావిస్తున్నారు.