Mumbai Indians on IPL Biosecure: మరో ఆరు రోజుల్లో ఐపీఎల్ -15వ సీజన్ ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈసారి అన్ని మ్యాచ్‌లను ముంబయి, పుణె వేదికల్లోనే బీసీసీఐ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తమ ఆటగాళ్ల భద్రతకు ముంబయి ఇండియన్స్ ప్రత్యేకంగా అవుట్‌డోర్ 'బయో సెక్యూర్'ను ఏర్పాటు చేసింది. జియో వరల్డ్ గార్డెన్‌లో దాదాపు 13వేల చదరపు మీటర్ల వైశాల్యంలో ఆటగాళ్లు, సిబ్బందికి కుటుంబ సభ్యులతో సహా రిఫ్రెష్ కావడానికి ఈ 'బయో సెక్యూర్ ఎంఐ ఎరేనా'ను సృష్టించింది. ఐపీఎల్ జరిగేది సొంత ప్రదేశంలో అయినప్పటికీ ఆటగాళ్లకు మానసికంగా, శారీరకంగా విశ్రాంతి తీసుకోవడమే కాకుండా వినోదం అందించడానికి ముంబయి ఫ్రాంచైజీ ఏర్పాట్లు చేసింది. బీసీసీఐ 'బయో సెక్యూర్ బబుల్'లో భాగంగానే 'ఎంఐ ఎరేనా' ఉంటుందని ముంబయి ఫ్రాంచైజీ ప్రకటన వెల్లడించింది.
"'ఎంఐ ఎరేనా'లో మైదానం, బాల్ కోర్ట్, బాక్స్ క్రికెట్, ఫుట్ వాలీబాల్, గోల్ఫ్ డైవింగ్ రేంజ్, ఎంఐ బ్యాటిల్‌గ్రౌండ్, మినీ గోల్ఫ్, ఎంఐ కేఫ్, కిడ్స్ జోన్ తదితర సదుపాయాలు ఉన్నట్లు ముంబయి తెలిపింది. "ఆటగాళ్లు ఒకరినొకరు బాగా కనెక్ట్ అయ్యేందుకు ఎంఐ ఎరేనాను సృష్టించాం. గత రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సవాళ్లను ఎదురయ్యాయి. 'ఒకే కుటుంబం' అనేది ముంబయి ఇండియన్స్ నినాదం. అందులో భాగంగా ప్రతి ఒక్కరినీ సురక్షితంగా, సంతోషంగా ఉంచడమే మా ప్రాధాన్యం, బాధ్యత" అని ముంబయి ఇండియన్స్ పేర్కొంది.