నాగ్‌పుర్‌కు చెందిన 13ఏళ్ల కుర్రాడు యశ్ చావ్డే ఇంటర్-స్కూల్ క్రికెట్ టోర్నమెంట్లో వీరబాదుడు బాదాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లతో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టాడు. 178 బంతుల్లోనే 508 రన్స్ కొట్టి నాటౌట్‌గా నిలిచాడు. ఇదేదో రోజుల తరబడి సాగే టెస్టు మ్యాచ్‌లో కాదు. 40 ఓవర్ల పాటు సాగిన మ్యాచ్‌లోనే ఈ విధ్వంసం సృష్టించాడు. యశ్ ఇన్నింగ్స్‌లో 81 ఫోర్లు, 18 సిక్సులు ఉన్నాయి. భారత్‌లో ఇంటర్-స్కూల్ క్రికెట్ టోర్నీల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం.
13ఏళ్లకే వీరోచిత ఇన్నింగ్స్.. '508' రన్స్ కొట్టిన బాలుడు.. 9పరుగులకే ప్రత్యర్థి ఆలౌట్
13ఏళ్ల కుర్రాడు సంచలన ప్రదర్శన చేశాడు. ఇంటర్-స్కూల్ టోర్నీలో 500కు పైగా రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. లిమిటెడ్ ఓవర్లలో విధ్వంసం సృష్టిస్తూ రికార్డు సాధించాడు.
ముంబయి ఇండియన్స్ జూనియర్ ఇంటర్ స్కూల్ (అండర్ 14) క్రికెట్ టోర్నీలో ఈ అరుదైన స్కోరు నమోదైంది. ఝులేలాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రౌండ్లో ఈ మ్యాచ్ నిర్వహించారు. యశ్ భారీ ఇన్నింగ్స్ ఫలితంగా చావ్డే ప్రాతినిధ్యం వహిస్తున్న సరస్వతి విద్యాలయ టీమ్ 40 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 714 రన్స్ చేసింది. చావ్డేతో పాటు బరిలోకి దిగిన ఓపెనర్ తిలక్ వాకోడే 97 బంతుల్లో 127 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ప్రత్యర్థి సిద్ధేశ్వర్ విద్యాలయ చేతులెత్తేసింది. ఐదు ఓవర్లలో 9 పరుగులకే కుప్పకూలింది.
లిమిటెడ్ ఓవర్ల క్రికెట్లో 500కు పైగా రన్స్ సాధించిన రెండో క్రికెటర్‌గా చావ్డే రికార్డుకెక్కాడు. శ్రీలంకకు చెందిన చిరత్ సెల్లెపెరుమ అండర్-15 ఇంటర్-స్కూల్ టోర్నీలో 553 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 2022 ఆగస్టులో ఈ మ్యాచ్ జరిగింది. మొత్తంగా అన్ని వయసుల వారిలో చూస్తే 500కు పైగా పరుగులు చేసిన పదో బ్యాటర్ చావ్డే. యశ్ చావ్డేకు ముందు ప్రణవ్ ధనవాడే (1009*), ప్రియాన్షు మోలియా (556*), పృథ్వీ షా (546), డాడీ హవేవాలా(515)లు.. 500కు పైగా స్కోర్లు చేశారు.