Mumbai Indians IPL: ముంబయి ఇండియన్స్.. ఐపీఎల్ 2022 సీజన్‌ను అత్యంత పేలవ ప్రదర్శనతో ప్రారంభించింది. నాలుగు మ్యాచ్‌లు ఆడినా బోణీ కొట్టలేక అభిమానులను నిరాశపరిచింది. 5 టైటిళ్లను ఖాతాలో వేసుకున్న జట్టు.. ఈ సీజన్లో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోవటంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే.. ఇది ముంబయికి కొత్తేమీ కాదు. మెగా ఆక్షన్ జరిగిన తర్వాత పలు సీజన్లలో ముంబయికి శుభారంభం లభించలేదు. వరుస ఓటములతోనే లీగ్‌ను ప్రారంభించిన సందర్భాలు ఉన్నాయి.
స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ కొన్ని విభాగాల్లో బలహీనంగా ఉండటం కూడా ముంబయి విజయాలను అందుకోకపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించినా బౌలింగ్ విభాగం బలహీనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు ముంబయి బౌలింగ్ అంటే ప్రత్యర్థి జట్లకు దడగా ఉండేది. ప్రారంభ ఓవర్లలో బౌల్ట్ కంట్రోల్ చేస్తే.. మిడిల్, డెత్ ఓవర్లలో బుమ్రా అదరగొట్టేవాడు. పొలార్డ్ కీలక సమయంలో స్లో బౌలింగ్‌తో వికెట్లు తీసేవాడు. అయితే.. ఇప్పుడు బుమ్రా ఒక్కడి మీదే భారమంతా పడుతోంది. యువ బౌలర్లు బాసిల్ థంపి, మురుగన్ అశ్విన్ ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నారు. పొలార్డ్, డానియల్ సామ్స్ విఫలమవుతున్నారు.
- 2008లో వరసుగా నాలుగు ఓటములు:ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్లో ముంబయి ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలై విమర్శలు ఎదుర్కొంది.
- 2014లో తొలి 5 మ్యాచుల్లో పరాజయం:2013 సీజన్‌తో మంచి ఫామ్‌లోకి వచ్చిన ముంబయి ఇండియన్స్ జట్టు ఆ తర్వాత జరిగిన మెగా ఆక్షన్‌తో మళ్లీ డీలా పడింది. 2014 మెగా ఆక్షన్‌లో జట్టు కూర్పులో మార్పుతో ఆ సీజన్లో శుభారంభం లభించలేదు. ఏకంగా వరుసగా ఐదు మ్యాచుల్లో ఓటమిపాలైంది.
- 2015లో 4 వరుస ఓటములు.. అయినా విజేత: 2015లో జరిగిన మెగా లీగ్‌లో వరుసగా తొలి నాలుగు మ్యాచుల్లో ఓడిపోయింది ముంబయి ఇండియన్స్. బోణీ కొట్టేందుకు ఇబ్బంది పడినా.. చివరకు టోర్నీ విజేతగా నిలిచి అందరిని ఆశ్చర్య పరిచింది. క్రమంగా పుంజుకున్న జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో విజయతీరాలకు చేరింది. ఈ సీజన్ సైతం మెగా ఆక్షన్ తర్వాతే జరగటం విశేషం.
- 2018లో వరుసగా మూడు ఓటములు: 2018 సీజన్ సైతం మెగా ఆక్షన్ తర్వాతే జరిగింది. ఈ లీగ్‌లోనూ ముంబయి ఇండియన్స్‌కు కలిసిరాలేదు. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన తర్వాతే బోణీ కొట్టింది.
- ఐపీఎల్ 2022లో వరుసగా నాలుగు ఓటములు: లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి టాప్ జట్టుగా చలామణి అవుతున్న రోహిత్ సేన.. 2022లో బోణీ కొట్టేందుకు ఇబ్బంది పడుతోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయి నిరాశపరిచింది.
ఆర్సీబీపై ఓటమి కారణాలు రోహిత్ మాటల్లో:ఆర్సీబీతో శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఓడిపోయి.. టోర్నీలో వరుసగా నాలుగో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ తమ ఓటమికి గల కారణాలను వెల్లడించారు. 'కొన్ని పిచ్‌లు, ప్రత్యర్థులపై కీలకంగా మారుతారనుకునే ఇద్దరు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో లేరు. మా బ్యాటింగ్‌ను బలోపేతం చేసుకోవాలి. వారు ఇద్దరి గైర్హాజరుతో ఆ లోటు కనిపిస్తోంది. నేను ఎక్కువ సమయం క్రీజ్‌లో ఉండాలి, కానీ దురదృష్టవశాత్తు రాంగ్ టైమ్‌లో ఔవుట్ అయ్యా. అది మమ్మల్ని దెబ్బతీసింది. మా జట్టు 150 చేరుకుందంటే ఆ క్రెడిట్ సూర్యాదే. అది సరిపోదని తెలుసు. బౌలింగ్‌లో రాణించాలనుకున్నా.. వారు బ్యాటింగ్‌లో నైపుణ్యం ప్రదర్శించారు. బ్యాటింగ్, బౌలింగ్‌తో కూడిన ఆల్‌రౌండ్ ప్రదర్శన అవసరమని ప్రతిసారి చెబుతాను. అదే ఈ మ్యాచ్‌లో మిస్సైంది' అని పేర్కొన్నారు.