MSK Prasad about Shardul Thakur: త్వరలో దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్‌లో భారత్ ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలని భావిస్తే ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు తుది జట్టులో అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని టీమ్‌ఇండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల టీమ్‌ఇండియా విదేశీ పర్యటనల్లో శార్దూల్ అద్భుతంగా రాణించాడు. ఈ నేపథ్యంలో శార్దూల్ గురించి ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడాడు. శార్దూల్ చేరిక వల్ల బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతం అవుతుందన్నారు.
"టీమ్ఇండియా ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగితే శార్దూల్ ఠాకూర్ అత్యుత్తమ ఎంపిక అవుతాడని నేను భావిస్తున్నా. ఏడో స్థానంలో బ్యాటర్‌గా కూడా ఉపయోగపడతాడు. అతనికి తోడుగా మరో ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉన్నాడు. అతడు తుది జట్టులో ఉంటే బ్యాటింగ్ లైనప్ కూడా మరింత బలంగా తయారవుతుంది. ప్రస్తుత ఫామ్ ఆధారంగా ఇషాంత్ శర్మ స్థానంలో ప్రతిభావంతుడైన మహ్మద్ సిరాజ్ ఆడతాడని అనుకుంటున్నా. బుమ్రా, అశ్విన్, మహ్మద్ షమీ, సిరాజ్‌లు ఫిట్‌గా ఉంటే జట్టులో కచ్చితంగా ఉంటారు."